ఆర్డీఎస్ఎస్‌లోకి తెలంగాణ
ABN , Publish Date - Feb 14 , 2026 | 03:26 AM
విద్యుత్ పంపిణీ రంగంలో సంస్కరణల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రీవ్యాంప్డ్ డిస్ర్టిబ్యూషన్ సెక్టార్ స్కీం...
కేంద్రప్రభుత్వ విద్యుత్ సంస్కరణల పథకంలో చేరాలని నిర్ణయం
డీఏజేజీయూఏ పథకంలోకి కూడా..
వారంలోగా డీపీఆర్ సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశం
మంత్రివర్గ ఆమోదం అనంతరం కేంద్రానికి డీపీఆర్
ఆర్డీఎ్‌సఎ్‌సలో చేరితే వ్యవసాయేతర కనెక్షన్లకు ప్రీపెయిడ్ మీటర్లు
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ పంపిణీ రంగంలో సంస్కరణల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రీవ్యాంప్డ్ డిస్ర్టిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్డీఎ్‌సఎ్‌స)తో పాటు ‘ధర్తీ అబా జన్‌జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ యోజన (డీఏజేజీయూఏ) పథకాల్లో చేరాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆర్డీఎ్‌సఎ్‌సకు సంబంధించిన డీపీఆర్ రూపకల్పనపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు నేతృత్వంలో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్కరణల కమిటీ(డీఆర్‌సీ) శుక్రవారం సమావేశమైంది. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌మిట్టల్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా, రెవెన్యూశాఖ కార్యదర్శి డీఎస్ లోకే్‌షకుమార్, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ, టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారం రోజుల్లో ఆర్డీఎ్‌సఎస్ డీపీఆర్‌ను రూపొందించాలని సీఎస్ ఆదేశించారు. ఇక గిరిజన/ఆదివాసీ ప్రాంతాల్లో విద్యుదీకరణకు ఉద్దేశించిన డీఏజేజీయూఏ డీపీఆర్‌ను ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ పథకం కింద మైదాన ప్రాంతాల్లో విద్యుదీకరణకు అవసరమైన నిధుల్లో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరించాల్సి ఉంటుంది. గిరిజన/ఆదివాసీ ప్రాంతాల్లో 80 శాతం కేంద్రం, 20 శాతం రాష్ట్రం భరిస్తాయి. రానున్న మంత్రివర్గ సమావేశంలో ఈ డీపీఆర్‌లకు ఆమోదం తీసుకొని.. కేంద్రానికి పంపిద్దామని సీఎస్ తెలిపారు.
ఆర్డీఎ్‌సఎ్‌సలో చేరితే ప్రీపెయిడ్ మీటర్లు
ఆర్డీఎ్‌సఎ్‌సలో రాష్ట్రం చేరాలంటే డీపీఆర్‌కు రాష్ట్ర మంత్రివర్గం విధిగా ఆమో దం తెలపాల్సి ఉంటుంది. ఈ పథకంలో చేరితే రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లు మినహా మిగిలిన విద్యుత్ వినియోగదారులందరికీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలి. ఎస్పీడీసీఎల్ పరిధిలో ప్రీపెయిడ్ మీటర్లకు రూ.4 వేల కోట్లు, సబ్ స్టేషన్ల సామర్థ్యం పెంపు/నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు మరో రూ.5 వేల కోట్ల వ్యయం కానుందని ఇప్పటికే అంచనా వేశారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో ప్రీపెయిడ్ మీటర్లకు రూ.2,800 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకురూ.3,500 కోట్లు అవసరమని లెక్కగట్టారు. ఆర్డీఎ్‌సఎ్‌సలో చేరిన నాటి నుంచి ఐదేళ్లలో లోపు డిస్కంల ఆదాయ, వ్యయాల మధ్య అంతరాన్ని శూన్యస్థాయికి తీసుకురావాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏటా విద్యుత్ చార్జీలను సవరించాలి. పంపిణీ, సరఫరా, వాణిజ్య నష్టాలను 12 - 15 శాతానికి తగ్గించాలి. ఈ పథకంలో చేరితే రాష్ట్రంలోని రెండు డిస్కంలకు కేంద్రం నుంచి రూ.5 వేల కోట్ల సాయం అందుతుంది.