దేశానికే ఆదర్శంగా తెలంగాణలో అక్రిడిటేషన్ల జారీ
ABN , Publish Date - May 01 , 2026 | 05:14 AM
రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.
46 వేల మంది జర్నలిస్టులకు ఇచ్చేలా జీవోల్లో మార్పులు
కార్డుల పంపిణీ ప్రారంభించిన మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. దేశంలో, ఇతర రాష్ట్రాల్లో జర్నలిస్టుల కోసం అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఇక్కడ అనుసరించాలన్న ఆలోచన మేరకు అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యం జరిగిందని చెప్పారు. ఈ నెల 30వ తేదీతో పాత కార్డుల గడువు ముగిసిన నేపథ్యంలో కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తున్నామన్నారు. గురువారం హైదరాబాద్‌లో పలువురు జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 46 వేల మందికి పైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చేందుకు జీవోల్లో మార్పులు చేశామన్నారు. తొలి విడతలో 2,800 వరకు రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కార్డులను జారీ చేస్తున్నామని వెల్లడించారు. మే 1న అన్ని జిల్లాల్లోనూ అక్రిడిటేషన్ కార్డులను పంపిణీ చేయాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఈ ప్రక్రియలో మే 10వ తేదీని కటాఫ్ డేట్‌గా పెట్టుకొని దరఖాస్తులు చేసుకోవాలని, ఆ తేదీలోగా వచ్చే దరఖాస్తులను పరిశీలించి ఆమోదిస్తామని వివరించారు. అక్రిడిటేషన్ల సంఖ్య తేలిన తర్వాత ఇతర సంక్షేమ పథకాలు, సౌకర్యాల కల్పనపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివా్‌సరెడ్డి, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.