Share News

తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు

ABN , Publish Date - May 31 , 2026 | 05:20 AM

తెలంగాణ సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ గుర్తించి ప్రభుత్వం సముచితంగా గౌరవిస్తుందని కె.కేశవరావు, మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు

  • కె. కేశవరావు, మంత్రి పొన్నం ప్రభాకర్‌

  • అర్హుల జాబితా రూపొందించాలని కమిటీ ఆదేశం

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ గుర్తించి ప్రభుత్వం సముచితంగా గౌరవిస్తుందని కె.కేశవరావు, మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్‌ కేకే అధ్యక్షతన మొదటిసారి సచివాలయంలో సమావేశమైంది. కమిటీ సభ్యులైన మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌, ఎమ్మెల్సీ కోదండరాం మాజీ ఎమ్మెల్సీ ఎస్‌. రాములు నాయక్‌, మోతె శోభన్‌ రెడ్డిలతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొని విధివిధానాలు, సమాచార సేకరణపై సుదీర్ఘంగా చర్చించారు. అమరవీరుల కుటుంబాలు, జైలు శిక్షలు అనుభవించిన వారు, పోలీస్‌ కేసులు ఎదుర్కొన్న వారితో పాటు క్షేత్రస్థాయిలో పోరాడిన మేధావులు, కళాకారులు, రచయితలు, ఉద్యోగులు, జర్నలిస్టులు, అడ్వకేట్లు, విద్యార్థులు, ఆర్టీసీ, సింగరేణి కార్మికులను గుర్తించి పారదర్శకంగా అర్హులైన జాబితా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిటీ నిర్ణయాలను వెల్లడిస్తూ, జూన్‌ 4న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి తగు సూచనలు, సలహాలు స్వీకరించనున్నట్లు ప్రకటించింది.

రూ.4000 కోట్ల అప్పు తీసుకోనున్న రాష్ట్రం

రాష్ట్ర ప్రభుత్వం రూ.4000 కోట్ల అప్పు తీసుకోనుంది. ఈమేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఇండెంటు పెట్టింది. జూన్‌ 2న ఆర్‌బీఐ నిర్వహించే ఈ-వేలం ద్వారా రుణాన్ని సేకరించనుంది. 7.97 శాతం వార్షిక వడ్డీ, 17 ఏళ్ల కాల పరిమితితో రూ.2000 కోట్లు, 8.07 శాతం వార్షిక వడ్డీ, 30 ఏళ్ల కాల పరిమితితో రూ.2000 కోట్ల చొప్పున అప్పు తీసుకోనుంది.

Updated Date - May 31 , 2026 | 05:20 AM