Share News

ఏప్రిల్‌ 2న గ్రామ సభలు

ABN , Publish Date - Mar 05 , 2026 | 02:10 AM

ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్‌ 2న రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలను నిర్వహించాలని ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది.

ఏప్రిల్‌ 2న గ్రామ సభలు

  • ఆరోగ్యం, విద్య, సంక్షేమం, భద్రత, పథకాలపై నివేదన

  • ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ మార్గదర్శకాలు జారీ

హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్‌ 2న రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలను నిర్వహించాలని ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. ఈ సభల నిర్వహణ విధానాన్ని, ప్రజలకు వివరించాల్సిన అంశాలపై వివరాలు వెల్లడించింది. 99 రోజులపాటు సాగే ఈ కార్యక్రమాన్ని ప్రభావవంతంగా నిర్వహించాలని అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులు, జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఇందులో భాగంగా 10 అంశాల(థీమ్‌)కు నోడల్‌ శాఖలను ప్రకటించి, నోడల్‌ అధికారులను నియమించింది. ఈ కార్యక్రమ మార్గదర్శకాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం జారీ చేశారు. జిల్లా కలెక్టర్లతో సీఎస్‌ బుధవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు.


ఐదు స్థాయిల్లో కార్యక్రమం

ఫిబ్రవరి 27న జరిగిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం, ఈ నెల 3న సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు... ఈ నెల 6 నుంచి జూన్‌ 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా 99 రోజులపాటు ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎస్‌ జారీచేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. దీనిని ఐదు స్థాయిల్లో నిర్వహిస్తామని చెప్పారు. ఏప్రిల్‌ 2న గ్రామస్థాయిలో, ఏప్రిల్‌ 16న మండల స్థాయిలో, మే 2న నియోజకవర్గ స్థాయిలో, మే 22న జిల్లా స్థాయిలో, జూన్‌ 2న రాష్ట్ర స్థాయిలో కార్యాచరణ ఉంటుందని వివరించారు. ఈ నెల 6న ఉమ్మడి జిల్లాలవారీగా... ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రుల అధ్యక్షతన ఈ కార్యక్రమ సంసిద్ధత (ప్రిపరేటరీ) సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఆ వెంటనే ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రారంభించాలని.. ఆ రోజు పారిశుద్ధ్యం, ఫైళ్ల క్లియరెన్స్‌ అనే అంశాలను తీసుకోవాలని తెలిపారు. ఈ ప్రణాళిక ఉద్దేశాలు, ప్రాధాన్యాలను కొత్తగా ఎన్నికైన సర్పంచులు, కార్పొరేటర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లకు వివరించడానికి ఈ నెల 12న ఒక రోజు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. అంశాలవారీగా చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి నోడల్‌ శాఖలు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తుంటాయని పేర్కొంది. ఏప్రిల్‌ 2న ఉదయం రాష్ట్ర గీతంతో సభలను ప్రారంభించాలని, ప్రజలకు ముఖ్యమంత్రి వీడియో సందేశాన్ని ప్రదర్శించాలని, శాఖలవారీగా సాధించిన విజయాలను వివరించి, లబ్ధిదారుల పేర్లను వెల్లడించాలని సూచించింది. గ్రామ సభల్లో రైతు భరోసా, రైతు బీమా, సోలార్‌ పంపులు, మాతా శిశువుల ఆరోగ్య పరిరక్షణ, టీకాలు, హెల్తీ బేబీ పోటీలు, కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతి, రైతు రుణమాఫీ, సన్న బియ్యానికి బోనస్‌, మహాలక్ష్మి, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్‌, ప్రభుత్వ స్కూళ్లలో డ్రాపౌట్స్‌, అమ్మ ఆదర్శ పాఠశాలలు, మధ్యాహ్న భోజనం, రహదారి భద్రత, మహిళలు, బాలికలపై అత్యాచారాల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు, క్రీడలు, గర్భిణులు,బాలింతలకు పోషకాహారం, బాల్య వివాహాల నియంత్రణ, స్వయం సహాయక బృందాలు, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌, ప్లాంటేషన్‌ అంశాలపై చర్చించాలని సూచించింది.


శాఖలవారీగా రిపోర్టులు

ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రభుత్వ రెండేళ్ల ప్రగతి నివేదికను ప్రకటించనున్నారు. ఈ మేరకు శాఖలవారీగా అధికారులు వివరాలను సిద్ధం చేస్తున్నారు. ప్రధాన పథకాల ద్వారా అందించిన సేవలతో కూడిన సమగ్ర రిపోర్టులను రూపొందిస్తున్నారు. ఈ నివేదికలను సీఎం రేవంత్‌రెడ్డికి అందించనున్నట్టు తెలిసింది. బీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్రంలో 89,97,055 రేషన్‌ కార్డులుండగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం దాదాపు 15,10,824 కొత్తకార్డులు మంజూరు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కోటీ 5లక్షలపైగా రేషన్‌ కార్డులున్నాయి.35-40 లక్షల మందికి వంటగ్యాస్‌ సిలిండర్‌కు రూ.500రాయితీ అందిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పేదలకు 3,24,733ఇళ్లను మంజూరు చేసింది. లబ్ధిదారులకు రూ.4,929కోట్లు అందించింది. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కింద ఇప్పటివరకు 200కోట్ల టికెట్లను అందించగా, రూ.6,800 కోట్ల మేర ప్రయాణాలు జరిగాయి. ఇలాంటి వివరాలతో పథకాలవారీ రిపోర్టులను సిద్ధంచేసే పనిలో అధికారులు ఉన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 02:10 AM