Share News

ఒక్కో ఫుల్‌ బాటిల్‌పై 80 పెంపు?

ABN , Publish Date - Jun 06 , 2026 | 04:00 AM

రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నాయి. పెరిగిన ధరలు ఈ నెల 15 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. లిక్కర్‌ తయారీ కంపెనీల ఒత్తిడి మేరకు ప్రభుత్వం మద్యం ..

ఒక్కో ఫుల్‌ బాటిల్‌పై 80 పెంపు?

  • ప్రీమియం బ్రాండ్లు అయితే రూ.90

  • హై-ఎండ్‌ కాస్ట్లీ బ్రాండ్లపై 120పైనే

  • ఈ నెల 15నుంచి మద్యం ధరల పెంపు!

  • బీర్ల ధరల్లో మార్పుల్లేవు

  • రెండుమూడురోజుల్లో ప్రభుత్వానికి ఫైలు

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నాయి. పెరిగిన ధరలు ఈ నెల 15 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. లిక్కర్‌ తయారీ కంపెనీల ఒత్తిడి మేరకు ప్రభుత్వం మద్యం ధరలను పెంచడానికి సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ముడిసరుకుల ధరలు, రవాణా ఖర్చులు బాగా పెరిగిన నేపథ్యంలో మద్యం ధరలను కూడా పెంచాలని లిక్కర్‌ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దీంతో, మద్యం ధరలను ఎంత మేర పెంచాలన్న దానిపై రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సునీల్‌ కిషోర్‌ జైస్వాల్‌ ఛైర్మన్‌గా, రిటైర్డ్‌ ఐఏఎస్‌ సునీల్‌ శర్మ, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ నవీన్‌ రెడ్డి సభ్యులుగా ప్రభుత్వం ఏప్రిల్‌లో త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ మూడు రోజులుగా మద్యం తయారీ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపింది. శుక్రవారంతో ఈ చర్చలు ముగిశాయి. మద్యం ధరలను 10 శాతం నుంచి 15శాతం మధ్యలో పెంచాలని కంపెనీలు కోరాయి. అయితే, కమిటీ మాత్రం ముడిసరుకుల ధరల్లో పెరుగుదల, రాష్ట్రంలో గతంలో ఎంత పెంచారు, మిగిలిన రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయన్న అంశాలను పరిగణనలోకి తీసుకొని మద్యం ధరలను పెంచాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీన్ని బట్టి సాధారణ బ్రాండ్లు అయితే ఒక్కో ఫుల్‌ బాటిల్‌పై గరిష్ఠంగా రూ.80 వరకు పెరగొచ్చని, ప్రీమియం బ్రాండ్లు అయితే రూ.90దాకా పెంపు ఉండొచ్చని, కాస్ట్లీ బ్రాండ్లు(హై-ఎండ్‌) అయితే రూ.120పైనే పెంపు ఉంటుందని ఎక్సైజ్‌శాఖలో పనిచేస్తున్న ఒక అధికారి తెలిపారు. కమిటీ తన నిర్ణయాన్ని బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులతో సమావేశమై చర్చించిన తర్వాత ధరల పెంపు ఫైల్‌ను రెండుమూడు రోజుల్లో ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిసింది. ఫైల్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఇదిలా ఉండగా, బీర్ల ధరలను కూడా పెంచాలని లిక్కర్‌ కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. కానీ, గతేడాది ఫిబ్రవరిలోనే బీర్ల ధరలను పెంచినందున ఆ ప్రతిపాదనను కమిటీ తిరస్కరించింది. దీంతో, ఈసారి బీర్ల ధరలు పెరగవు. రాష్ట్రవ్యాప్తంగా 2620 వైన్‌ షాపులున్నాయి. మద్యం ధరల పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాకు నెలకు రూ.200కోట్ల నుంచి రూ.250కోట్ల ఆదాయం అదనంగా సమకూరనుంది. అంటే ఏడాదికి రూ.2,400 కోట్ల నుంచి రూ.3వేల కోట్లు వస్తాయని అంచనా. ఈ నెల 15వ తేదీ నుంచే కొత్త ధరలు అందుబాటులోకి వస్తాయని మద్యం తయారీదారులు ఇప్పటికే తమ గ్రూపుల్లో ప్రచారం చేసుకోగా.. అసోసియేషన్లతో కమిటీ మరోసారి సమావేశమయ్యాకే ధరల అమలు తేదీని నిర్ణయించే అవకాశం ఉంటుందని ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Updated Date - Jun 06 , 2026 | 04:00 AM