Share News

హమాలీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు:వివేక్‌

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:13 AM

రాష్ట్రంలోని హమాలీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని కార్మిక, ఉపాధి కల్పన మంత్రి జి. వివేక్‌ వెంకటస్వామి తెలిపారు.

హమాలీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు:వివేక్‌

హైదరాబాద్‌/ బర్కత్‌పుర/ గోషామహల్‌ జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని హమాలీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని కార్మిక, ఉపాధి కల్పన మంత్రి జి. వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. హమాలీల సమస్యలు, సంక్షేమ అవసరాలపై సమగ్ర అధ్యయనం చేసి, నిపుణులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో కూడిన ప్రత్యేక కమిటీని వెంటనే ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత, బీమా, ఇతర ప్రయోజనాలపై కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. తెలంగాణ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన సదస్సులో మంత్రి మాట్లాడారు. త్వరలోనే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద అర్హులైన కార్మిక కుటుంబాలకు రూ.5 లక్షల వరకు బీమా రక్షణ కల్పించనున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి హమాలీ కార్మిక కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహ వసతి కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాం మాట్లాడుతూ హమాలీలకు ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, సామాజిక భద్రత, బీమా, పెన్షన్‌ వంటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కాగా, గృహ కార్మికుల భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చేలా కృషి చేస్తానని మంత్రి వివేక్‌ భరోసా ఇచ్చారు. అబిడ్స్‌లో నిర్వహించిన అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. వారి సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే ఓ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 04:13 AM