Share News

ఇక పరిషత్‌ పోరు

ABN , Publish Date - Feb 18 , 2026 | 04:20 AM

పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంలో పరిషత్‌ ఎన్నికలనూ నిర్వహించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక పరిషత్‌ పోరు

  • 10వ తరగతి పరీక్షలకు ముందా? తర్వాతా?

  • తర్జన భర్జనలో సర్కారు..

  • 23న క్యాబినెట్‌ భేటీలో రానున్న స్పష్టత

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంలో పరిషత్‌ ఎన్నికలనూ నిర్వహించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 16 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో తర్జన భర్జన నడుస్తున్నట్లు సమాచారం. ఎస్‌ఎ్‌ససీ బోర్డు పరీక్షలకు ముందు ప్రీ ఫైనల్‌ పరీక్షల నిర్వహణలో ఉపాధ్యాయులు తలమునకలుగా ఉంటారన్న సంగతి తెలిసిందే. మరో వైపున మార్చి 15 లోగా పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తికాకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ.450కోట్ల మేరకు నిధులు మురిగిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పరిషత్‌ ఎన్నికలను ఎస్సెస్సీ బోర్డు పరీక్షలకు ముందు నిర్వహించాలా.. లేక ఆ పరీక్షలు ముగిసిన తర్వాత.. ఏప్రిల్‌ నెలలో నిర్వహించాలా? అన్నదానిపై తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. ఈ నెల 23న సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో దీనిపైన స్పష్టత రానుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌... పార్టీ పరంగా బీసీలకు 50 శాతానికి పైగా సీట్లు ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియనూ ప్రభుత్వం పూర్తి చేసింది.


ఈ ఎన్నికల్లోనూ బీసీలకు పార్టీ పరంగా 50 శాతానికి పైగా సీట్లు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ 80 శాతానికి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఈ ఉత్సాహానికి తోడు కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రూ. 450 కోట్ల మేరకు నిధులూ రావాల్సి ఉండటంతో పరిషత్‌ ఎన్నికలూ నిర్వహించే ఆలోచన రేవంత్‌ సర్కారు చేస్తోంది. ఈ నెల 23న జరిగే క్యాబినెట్‌ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎస్‌ఎ్‌ససీ పరీక్షలకు ముందే పరిషత్‌ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తే.. 15 రోజుల్లోగా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. మార్చిలోనే రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి.. 14లోగా జెడ్పీ చైర్మన్ల ఎన్నికనూ పూర్తి చేయనున్నట్లు చెబుతున్నారు. వెంటనే ఆర్థిక సంఘానికి నివేదికలు పంపనున్నట్లు సమాచారం. ఎస్‌ఎ్‌ససీ పరీక్షల తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిస్తే.. ఏప్రిల్‌ చివర్లో జరిగే ఆస్కారం ఉంది.


రాష్ట్ర బడ్జెట్‌ పైనా చర్చ

23న జరిగే క్యాబినెట్‌ భేటీలో పరిషత్‌ ఎన్నికలతో పాటుగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌పైనా చర్చించనున్నారు. బడ్జెట్‌ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహిస్తారన్న దానిపైనా ఈ భేటీలో స్పష్టత రానుంది.

Updated Date - Feb 18 , 2026 | 04:22 AM