త్వరలో 5 వేల పోలీసు పోస్టుల భర్తీ
ABN , Publish Date - May 30 , 2026 | 03:45 AM
రాష్ట్ర పోలీసు శాఖను బలోపేతం చేసే విధంగా దాదాపు 5వేల పోలీసు పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. దీనికి సంబంఽధించిన ప్రతిపాదనలు పోలీసుశాఖ నుంచి ఆర్ధికశాఖకు చేరినట్లు సమాచారం.
దశలవారీగా మరో 14 వేల పోస్టులు కూడా
రంగం సిద్ధం చేసిన పోలీసు శాఖ
ఆర్థిక శాఖకు చేరిన ప్రతిపాదనలు
సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఈగల్ ఫోర్స్ బలోపేతమే లక్ష్యంగా రిక్రూట్‌మెంట్
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్, మే 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పోలీసు శాఖను బలోపేతం చేసే విధంగా దాదాపు 5వేల పోలీసు పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. దీనికి సంబంఽధించిన ప్రతిపాదనలు పోలీసుశాఖ నుంచి ఆర్ధికశాఖకు చేరినట్లు సమాచారం. కొన్నాళ్లుగా తెలంగాణ పోలీసుశాఖ తీవ్రమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్న నేపఽథ్యంలో తొలి విడతగా 5 వేల కానిస్టేబుల్, సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులను భర్తీ చేయడానికి పోలీసు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ పోలీసుశాఖలో 19 వేలకు పైగా పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో దశల వారీగా రిక్రూట్‌మెంట్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముందుగా 5 వేల పోస్టులను, ఆ తర్వాత మిగిలిన 14 వేల ఖాళీలను భర్తీ చేసే ఆలోచనలో ఉంది. ఆర్ధికశాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే నియామక ప్రక్రియపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈసారి చేపట్టబోయే పోలీసు రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన వారిలో అత్యధికులను దేశానికి సవాలుగా మారిన సైబర్ నేరాలు, మత్తుమందుల కట్టడికి సంబంధించిన విభాగాల్లో వాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించిన ట్లు సమాచారం. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఈగల్ ఫోర్స్‌ను యువరక్తంతో బలోపేతం చేయడంతో పాటు పోలీసుశాఖలో సాంకేతిక అర్హతలున్న వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలలో కొందరిని వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఈగల్ ఫోర్స్‌కు బదిలీ చేయాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీలో పనిచేస్తున్న ఉన్నత విద్యార్హతలున్న మెరికల్లాంటి పోలీసుల సేవలను తొలి విడతలో సైబర్ సెక్యూరిటీ, ఈగల్ ఫోర్స్‌లో వాడటానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. వాస్తవానికి పోలీసుశాఖలో ఇటీవల ప్రతి ఏడాది సుమారు 2-3 వేల మంది వివిధ హోదాల్లోని పోలీసులు రిటైర్ అవుతున్నారు. దీంతో, ఉన్నవారిపై పనిభారం అధికమవుతోంది. ఈ క్రమంలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేయనున్నుట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.