రాష్ట్రవ్యాప్తంగా తాటి ఈత వనాల పెంపకం..!
ABN , Publish Date - May 15 , 2026 | 04:47 AM
రాష్ట్రవ్యాప్తంగా తాటి, ఈత మొక్కల వనాలు పెంచుతున్నామని.. గ్రామాల్లో, నర్సరీలలో వీటి పెంపకానికి ప్రాధాన్యం ఇస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
ఈ నెల 24న ఎక్స్‌పీరియం పార్కులో ‘‘టాడీ మ్యూజిక్ ఫెస్టివల్’’: మంత్రి పొన్నం
రూ. 10 కోట్లతో విదేశాల నుంచి 500 రకాల తాటి చెట్లు
ఎక్స్‌పీరియం అధినేత రాం దేవ్‌రావ్
హైటెక్‌సిటీ, మే 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా తాటి, ఈత మొక్కల వనాలు పెంచుతున్నామని.. గ్రామాల్లో, నర్సరీలలో వీటి పెంపకానికి ప్రాధాన్యం ఇస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వ్యాపారవేత్త రాం దేవ్‌రావు అధ్యక్షతన జరిగిన ‘టాడీ మ్యూజిక్ ఫెస్టివల్’ పోస్టర్ ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నెల 24న చిలుకూరి బాలాజీ దేవాలయం రోడ్డులో ఉన్న ఎక్స్‌పీరియం పార్కులో ‘టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ ఎక్స్‌పీరియం- 2026’ పేరుతో తాటికల్లు మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కల్లు ఆరోగ్యానికి మంచిదని, దీనిని ప్రధాన హోటళ్లలో కూడా అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు. ఎక్స్ పీరియం అధినేత రాం దేవ్‌రావ్ మాట్లాడుతూ.. వరంగ ల్‌కు చెందిన తాను ప్రకృతిపై ఉన్న మక్కువతో, సుమారు 85 దేశాలు తిరిగి తాటిపై పరిశోధన చేసినట్లు పేర్కొన్నారు. కాంబోడియా వంటి దేశంలో తాటి వినియోగం ఎక్కువగా ఉందని అన్నారు. అన్ని దేశాలు పరిశీలించి దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో 500 రకాల విదేశీ తాటి చెట్లను నగరానికి తీసుకువచ్చామని, వాటిని అందరికీ పరిచయం చేయడానికి తాడి మ్యూజికల్ ఫెస్టివల్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తునట్లు వివరించారు. కల్లు గీత కార్మికులంటే సమాజంలో చిన్నచూపు ఉందని, దానిని పోగొట్టడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. విదేశాల్లో 750 ఎమ్‌ఎల్ కల్లు బాటిల్ ధర రూ. 3500 ఉందని, అదే బీరు బాటిల్ వంద రూపాయిలకే లభిస్తుందని గుర్తు చేశారు. కల్లును స్టేట్ డ్రింక్‌గా ప్రకటించి, బార్లలో ఆల్కాహాల్, బీరు మాదిరిగానే విక్రయించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని పొన్నం ప్రభాకర్‌ను రాం దేవ్‌రావ్ కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు.