Share News

ధాన్యం కొనుగోళ్లలో సవాళ్లను అధిగమించాలి

ABN , Publish Date - Feb 22 , 2026 | 06:49 AM

రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా.. కొనుగోళ్లు, విక్రయాల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోళ్లలో సవాళ్లను అధిగమించాలి

  • డిమాండ్‌ ఉన్న పంటలను ప్రోత్సహించాలి: మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా.. కొనుగోళ్లు, విక్రయాల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ మార్కెట్లో తెలంగాణ బియ్యానికి ఉన్న గుర్తింపునకు తగినట్లుగా ఎగుమతులు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు, విక్రయాలపై శనివారం ఆయన సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన 72 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని విక్రయించేందుకు మార్గాలు అన్వేషించాలన్నారు. రాష్ట్రం నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఫిలిప్పైన్స్‌కు బియ్యంను ఎగుమతి చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. ప్రతి సంవత్సరం 3 మిలియన్‌ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్న నైజీరియా వంటి దేశాలు కూడా మనకు ఆశాజనకంగా కనిపిస్తున్నాయని చెప్పారు. సంబంధిత దేశాల్లో వినియోగించే బియ్యంపైశాస్త్రవేత్తలు అధ్యయనం జరిపి రాష్ట్రంలో ఆయా పంటలను పండించేలా రైతాంగాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం దిగుబడికి అనుగుణంగా కొనుగోళ్లను పెంచాల్సి ఉందని, ఈ విషయమై కేంద్రాన్ని డిమాండ్‌ చేయాలని అధికారులకు సూచించారు.

Updated Date - Feb 22 , 2026 | 06:51 AM