Share News

61,125 మంది రైతులకు నేడు కిట్ల పంపిణీ

ABN , Publish Date - Mar 17 , 2026 | 04:19 AM

జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 489 క్లస్టర్లలో ఎంపిక చేసిన 61,125 మంది రైతులకు మంగళవారం ఫార్మర్‌ కిట్ల పంపిణీ ప్రారంభమవుతుందని ....

61,125 మంది రైతులకు నేడు కిట్ల పంపిణీ

సచివాలయం నుంచి ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 489 క్లస్టర్లలో ఎంపిక చేసిన 61,125 మంది రైతులకు మంగళవారం ఫార్మర్‌ కిట్ల పంపిణీ ప్రారంభమవుతుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు సచివాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో రైతులకు ప్రజా ప్రతినిధులు కిట్లను పంపిణీ చేస్తారన్నారు. ప్రతి క్లస్టర్‌కు 125 మంది రైతులకు ఫార్మర్‌ కిట్లను పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ కిట్‌లో క్లాత్‌ బ్యాగ్‌, క్షేత్ర దర్శిని, గుర్తింపు కార్డు, ప్రత్యేక క్యాలండర్‌, చిన్న ప్యాకెట్‌ డైరీ తదితర వస్తువులు ఉంటాయి. జాతీయ ప్రకృతి వ్యవసాయంపై మంగళవారం రైతునేస్తం కార్యక్రమంలో శిక్షణ ఉంటుందన్నారు. సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్న తుమ్మల.. ప్రతి క్లస్టర్‌కు ఇద్దరు కృషి సఖి (రైతు)లను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. వారి ద్వారా ప్రతి క్లస్టర్‌లోని 125 మంది రైతులకు సేంద్రీయ సాగుపై అవగాహన కల్పిస్తామన్నారు.

రైతు భరోసాపై సీఎంకు కృతజ్ఞతలు

22 నుంచి రైతులకు యాసంగి సీజన్‌ రైతు భరోసా నిధులను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం సీఎం రేవంత్‌ను కలిసి శాలువాతో సత్కరించారు.

Updated Date - Mar 17 , 2026 | 04:19 AM