కొత్తగా 12 లాజిస్టిక్ పార్కులు!
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:05 AM
రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 10-12 కొత్త లాజిస్టిక్ పార్కులు, కొన్ని చోట్ల డ్రై పోర్టులు, మరి కొన్ని ప్రాంతాల్లో అక్కడి అవసరాలను బట్టి గిడ్డంగులను నిర్మించనుంది.
కొన్ని ప్రాంతాల్లో డ్రై పోర్టులు, గిడ్డంగులు
స్మార్ట్ డిజిటల్ లాజిస్టిక్ కేంద్రాలుగా అభివృద్ధి
రోడ్డు, రైలు, విమాన మార్గాలతో అనుసంధానం
సిద్ధమవుతున్న మాస్టర్‌ప్లాన్, లాజిస్టిక్ పాలసీ 2.0
అతి త్వరలో ఆవిష్కరణఆ
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 10-12 కొత్త లాజిస్టిక్ పార్కులు, కొన్ని చోట్ల డ్రై పోర్టులు, మరి కొన్ని ప్రాంతాల్లో అక్కడి అవసరాలను బట్టి గిడ్డంగులను నిర్మించనుంది. వీటన్నింటినీ టెక్నాలజీ ఆధారిత స్మార్ట్ డిజిటల్ లాజిస్టిక్ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సర్కారు భావిస్తోంది. ఈ మేరకు ‘తెలంగాణ లాజిస్టిక్ హబ్ మాస్టర్‌ప్లాన్’- ‘తెలంగాణ లాజిస్టిక్ పాలసీ-2.0’ను ప్రభుత్వం రూపొందిస్తోంది. త్వరలోనే వీటిని ఆవిష్కరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 2047నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు లాజిస్టిక్ పాలసీ ఎంతో దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం రేవంత్ దిశానిర్దేశం మేరకు లాజిస్టిక్ పాలసీకి సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌ను ఉన్నతాధికారులు సిద్ధం చేస్తున్నారు. పరిశ్రమలను ఆకర్షించడం, ఎగుమతులను పెంచడం, రవాణా ఖర్చులను తగ్గించడం, మెరుగైన సరఫరా వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా ఈ పాలసీని రూపొందిస్తున్నారు.
ఇదీ మాస్టర్‌ప్లాన్..
2047 నాటికి దేశంలో అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్‌కు తెలంగాణనే గమ్యస్థానంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసమే మాస్టర్‌ప్లాన్‌ను అత్యంత పకడ్బందీగా రూపొందిస్తోంది. సరుకు రవాణా మార్గాల అభివృద్ధి, వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు, ఈ-కామర్స్ సంస్థలకు సహకారం, పరిశ్రమల క్లస్టర్లు, ఎగుమతుల కోసం ప్రత్యేక కారిడార్లు.. ఇలా అనేక అంశాలను మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరుస్తున్నారు. ప్రధానంగా లాజిస్టిక్ పార్కులు, గిడ్డంగులను విడతల వారీగా అభివృద్ధి చేసి రోడ్డు, రైలు, విమాన మార్గాలతో అనుసంధానం చేయనున్నారు. ఆటోమేషన్, డిజిటల్ విధానాల అమలు, పర్యావరణహిత విధానాల అమలుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే రీజినల్ రింగు రోడ్డు సమీపంలో డ్రైపోర్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్యూచర్‌సిటీ నుంచి బందరు పోర్టు వరకు 297కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేతోపాటు అదే రూట్‌లో ప్రతిపాదించిన రైల్వే లైనుకు దీనిని అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. ఈ డ్రై పోర్టు నుంచి ఓఆర్‌ఆర్ పరిధిలోని ప్రాంతాలకు లాజిస్టిక్ సేవలు విస్తృతం కానున్నాయి. ఈ క్రమంలోనే మంగళపల్లి, బాటసింగారం లాజిస్టిక్ పార్కులను ఆధారంగా చేసుకుని మరో 10-12 కొత్త లాజిస్టిక్ పార్కులు, పలు డ్రై పోర్టులతోపాటు గిడ్డంగులను ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. మనోహరాబాద్‌లో మెగా మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కు నిర్మాణం జరుగుతుండగా, దీనికి రోడ్డు- రైలు మార్గాలను అనుసంధానం చేయనున్నారు.
ప్యూర్‌పై దృష్టి..
ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్) నుంచి రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) మధ్య ఉన్న ప్రాంతాన్ని ‘పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ’ (ప్యూర్)గా ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాంతంలో తయారీ యూనిట్లు, ఎంఎ్‌సఎంఈ క్లస్టర్లు, లాజిస్టిక్ హబ్‌లను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థలను అనుసంధానించి.. ఉపాధి అవకాశాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ఈ ప్రాంతం పారిశ్రామి కంగా ప్రగతి సాఽధించడంతోపాటు సరుకు రవాణాకు అనువైన వాతావరణం కల్పించనుంది. అలాగే, రాష్ట్రంలో ఎయిర్‌కార్గోను కూడా బలోపేతం చేసే దిశగా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్‌పోర్టు (ఆర్జీఐఏ) దేశంలోనే ప్రముఖ ఎయిర్ కార్గో కేంద్రంగా గుర్తింపు పొందింది. ఔషధాలు, జీవశాస్త్ర సంబంధిత ఉత్పత్తులు, ఎలకా్ట్రనిక్స్ వంటి అధిక విలువైన సరుకులు ఇక్కడి నుంచే రవాణా అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎయిర్‌కార్గోను రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానం చేయనున్నారు. దీంతో లాజిస్టిక్ రంగం మరింత వృద్ధి చెందుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.