Share News

వచ్చే ఐదు నెలల్లో 10 వేల మందికి ఉపాధి

ABN , Publish Date - Jul 15 , 2026 | 06:02 AM

రాష్ట్రంలో రూ.2,400 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 65 అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ), ఐటీఐల ద్వారా వచ్చే ఐదు నెలల్లో పది వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు అధికారులు తెలిపారు.

వచ్చే ఐదు నెలల్లో 10 వేల మందికి ఉపాధి

  • ఏటీసీ, ఐటీఐల ద్వారా కల్పనకు ఏర్పాట్లు

  • వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి రాష్ట్రంలో మరో 51 కొత్త ఏటీసీ కేంద్రాలు

  • ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్న అధికారులు

హైదరాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రూ.2,400 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 65 అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ), ఐటీఐల ద్వారా వచ్చే ఐదు నెలల్లో పది వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు అధికారులు తెలిపారు. వీటి ద్వారా ఇప్పటికే 1,048 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్టు వెల్లడించారు. బుధవారం ఐక్యరాజ్యసమితి ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం ఉన్న నేపథ్యంలో ఈ వివరాలు వెల్లడించారు. 2027 సెప్టెంబరు నాటికి తెలంగాణలో మరో 51 ఏటీసీలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏటీసీ కేంద్రాల్లో శిక్షణ పొందే ప్రతి విద్యార్థికి నెలకు రూ.2 వేల చొప్పున ఉపకార వేతనం అందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఏటా రూ.82 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వివరించారు. తెలంగాణలో ఓవర్సీస్‌ మానవ వనరుల సంస్థ ద్వారా ఇప్పటివరకు 14 వేల మందికి విదే శాల్లో ఉపాధి అవకాశాలు కల్పించామని, మరో 4,500 మంది విదేశీ ఉద్యోగాల కోసం భాషా పరమైన శిక్షణ పొందుతున్నారని తెలిపారు. నిజామాబాద్‌, సిద్దిపేట జిల్లాల్లో నిర్వహించిన జాబ్‌ మేళాలకు అనూహ్య స్పందన వచ్చిందని.. అదే తరహాలో రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో జాబ్‌ మేళాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీలో వందలాది మంది వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు.

Updated Date - Jul 15 , 2026 | 06:04 AM