Share News

రాష్ట్రంలోనూ ఇళ్ల లెక్కింపు

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:32 AM

వచ్చే ఏడాదిలో దేశవ్యాప్తంగా చేపట్టనున్న జన గణనలో భాగంగా రాష్ట్రంలో ఇళ్ల లెక్కింపు (హౌస్‌ లిస్టింగ్‌)ను చేపట్టనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్రంలోనూ ఇళ్ల లెక్కింపు

  • నెల రోజుల పాటు గణన

హైదరాబాద్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాదిలో దేశవ్యాప్తంగా చేపట్టనున్న జన గణనలో భాగంగా రాష్ట్రంలో ఇళ్ల లెక్కింపు (హౌస్‌ లిస్టింగ్‌)ను చేపట్టనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నెల రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈమేరకు సీఎస్‌ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 2027లో కేంద్ర ప్రభుత్వం జన గణనను చేపట్టనున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2027 మార్చి నుంచి జనగణన ప్రారంభంకానుంది. మంచు ప్రభావిత రాష్ట్రాల్లో ఈ అక్టోబరులోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. జన గణనకు ముందుగా దేశవ్యాప్తంగా ఈ ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ఇళ్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్రంలోనూ ఈ ఆరు నెలల కాలంలో ఒక నెల రోజులు ఇళ్ల లెక్కింపు చేపడతారు. ఇళ్ల గణనతోపాటు కుటుంబ ఆస్తులు, సౌకర్యాల వివరాలను కూడా సేకరిస్తారు. ఇళ్ల లెక్కింపులో ప్రజలు స్వయంగా వివరాలు పంపుకొనే (సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌) అవకాశాన్ని కల్పించారు. ఈమేరకు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చే వెబ్‌ పోర్టల్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా తమ ఇళ్ల వివరాలను పంపవచ్చు. అయితే ఇళ్ల లెక్కింపు ప్రారంభమయ్యే తేదీకి 15రోజుల ముందే ఆన్‌లైన్‌లో వివరాలు పంపాలి.

Updated Date - Jan 23 , 2026 | 04:32 AM