మే చివరికి డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు పూర్తి
ABN , Publish Date - May 01 , 2026 | 05:34 AM
రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి మే చివరి నాటికి లబ్ధిదారులకు కేటాయించాలని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అధికారులను...
వాటిలో నివాసం ఉండకపోతే రద్దు
ఇందిరమ్మ ఇళ్లకు రూ.5,808 కోట్ల ఖర్చు
లబ్ధిదారుల ఎంపిక బాధ్యత కలెక్టర్లదే
ప్రభుత్వ భూముల సంరక్షణలో రాజీ లేదు
ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాల సమీక్షలో మంత్రులు పొంగులేటి, దుద్దిళ్ల
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి మే చివరి నాటికి లబ్ధిదారులకు కేటాయించాలని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అధికారులను ఆదేశించారు. పనుల పూర్తికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే లబ్ధిదారులే పనులు చేసుకునేలా ప్రొత్సహించాలని సూచించారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాల్లో గృహనిర్మాణ పథకాల అమలుపై హిమాయత్ నగర్‌లోని హౌసింగ్ కార్పొరేషన్‌లో సంబంధిత జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, అఽధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు గ్రీన్ చానెల్ ద్వారా నిధులు ఇస్తున్నామన్నారు. ఇళ్ల సముదాయాల్లో రూ.400 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో డబుల్ బెడ్రూం ఇళ్లు తీసుకుని వాటిలో నివాసం ఉండని వారికి రద్దు చేసి, వాటిని అర్హులైన వారికి కేటాయిస్తామని పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడితే అధికారులను సర్వీస్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. పేదవారికి సహా యం చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఇంటికి 40 టన్నుల ఇసుకను సీఎం రేవంత్‌రెడ్డి ఉచితంగా అందిస్తున్నారని గుర్తుచేశారు. లబ్ధిదారుల ముసుగులో ఇసుక అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీపడబోమని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు. రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని కలెక్టర్లకు సూచించారు. కొత్తగా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో 30 కేవీ రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్తు ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు.
ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం: శ్రీధర్‌బాబు
ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. దీనిపై కలెక్టర్లు మరింత దృష్టిసారించాలని సూచించారు. మంజూరైన ప్రతి ఇల్లు నిర్మాణం అయ్యేలా చూడాలని కోరారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో కార్యచరణ ప్రణాళికలు తయారు చేసుకుని పరిష్కరించాలని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 13 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యాన్ని అందుకోలేని ఉద్యోగులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.5808 కోట్ల ఖర్చు చేసిందన్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, కరీంనగర్ ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు పాల్గొన్నారు.