Share News

ఖరీదైన భూముల్లో ఎల్‌ఐజీ, ఎంఐజీ ఇళ్లు!

ABN , Publish Date - Jun 01 , 2026 | 04:58 AM

ఇందిరమ్మ ఇంటి పథకం కింద పేదలకు ఆర్థిక సాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అల్పాదాయ (ఎల్‌ఐజీ), మధ్య ఆదాయ (ఎంఐజీ) వర్గాలకు కూడా సరసమైన ధరకు ఇళ్లను అందించాలని నిర్ణయించింది.

ఖరీదైన భూముల్లో ఎల్‌ఐజీ, ఎంఐజీ ఇళ్లు!

  • జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 నియోజకవర్గాల్లోని 15 ప్రాంతాల్లో స్థలాల గుర్తింపు

  • ఎల్‌ఐజీ వర్గాలకు భూమి ఉచితం, రూ.5 లక్షల రాయితీ

  • ఎంఐజీ వర్గాలకు ‘లాభనష్టాలు లేని’ విధానంలో ఇళ్లు

  • 12 వేల ఇళ్లతో పైలట్‌ ప్రాజెక్టు

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇంటి పథకం కింద పేదలకు ఆర్థిక సాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అల్పాదాయ (ఎల్‌ఐజీ), మధ్య ఆదాయ (ఎంఐజీ) వర్గాలకు కూడా సరసమైన ధరకు ఇళ్లను అందించాలని నిర్ణయించింది. అది కూడా నగరానికి దూరంగా కాకుండా.. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోనే నిర్మించి ఇవ్వనుంది. గుర్తించిన స్థలాల్లో ఎల్‌ఐజీ, ఎంఐజీ వర్గాల వారీగా అపార్ట్‌మెంట్లను నిర్మించనుంది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎంత స్థలం అందుబాటులో ఉంది? అక్కడ ఎల్‌ఐజీ, ఎంఐజీ ఇళ్లకు ఎంత డిమాండ్‌ ఉంటుందనే అంశాలను హౌసింగ్‌ బోర్డు పరిశీలిస్తోంది. ఇప్పటికే 15 చోట్ల స్థలాలను కూడా గుర్తించారు. కూకట్‌పల్లిలో హౌసింగ్‌ బోర్డు పరిధిలో ఉన్న 80 ఎకరాల్లోని కొంత స్థలంలో అపార్ట్‌మెంట్లు నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇది చాలా ఖరీదైన భూమి. ఈ భూమిలో ప్రభుత్వం ఎల్‌ఐజీ, ఎంఐజీ వర్గాలకు ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక్కడ ఎన్ని ఇళ్లు నిర్మించాలనేదానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్‌) త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనున్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం పరిధిలోనూ అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి అనువైన స్థలాన్ని అధికారులు ఇప్పటికే గుర్తించారు. అలాగే కుత్బుల్లాపూర్‌, బాచుపల్లి, అల్వాల్‌, ఇబ్రహీంపట్నం సహా మొత్తం 15 నియోజకవర్గాల్లో స్థలాలను గుర్తించారు. అవన్నీ హౌసింగ్‌ బోర్డు పరిధిలోనివేనని తెలిసింది. మిగిలిన నియోజకవర్గాల్లోనూ త్వరగా స్థలాలను గుర్తించాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశించారు. మరోవైపు పైలట్‌ ప్రాజెక్టు కింద చేపట్టాలనుకున్న 12 వేల ఇళ్ల పనుల ప్రారంభానికీ త్వరలోనే చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.


అందుబాటు ధరల్లో ఉండేలా..

ఎల్‌ఐజీ, ఎంఐజీ వర్గాల వారికి అందుబాటు ధరల్లోఉండేలా ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ‘సరసమైన ధరలకే పట్టణ గృహ కార్యక్రమాని’కి శ్రీకారం చుట్టింది. వాస్తవానికి ఫ్యూచర్‌సిటీ పరిధిలో, ఓఆర్‌ఆర్‌ దగ్గర్లో శాటిలైట్‌ టౌన్‌షి్‌పలను ఏర్పాటు చేయాలని తొలుత భావించింది. తద్వారా ఆయా ప్రాంతాలకు భవిష్యత్తులో డిమాండ్‌ పెరుగుతుందని యోచించింది. కానీ, ప్రజలకు అనువుగా లేనిచోట, జీవనోపాధికి దూరంగా ఇళ్లను నిర్మించడంతో ఉపయోగం ఉండదని, అక్కడికి వెళ్లేందుకు ప్రజలు ఆసక్తి కనబర్చరన్న విషయాన్ని గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం గుర్తించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఎల్‌ఐజీ, ఎంఐజీ వర్గాలకు ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. ఉమ్మడి ఏపీలో కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు సహా ఇతర ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లను పరిగణనలోకి తీసుకుంది. హౌసింగ్‌ బోర్డు, దిల్‌, ఇతర భూముల్లో ఇళ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానం, లేదా ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని నిర్మించడం, లబ్ధిదారులతో వాటాలు పెట్టించడం ఇలా పలు అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం హౌసింగ్‌ బోర్డు పరిధిలో ఉన్న 598 ఎకరాల్లో ఎక్కడెక్కడ అపార్ట్‌మెంట్ల నిర్మాణాలకు అనువుగా ఉన్నాయన్నదానిపైనా అఽధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

లాభనష్టాలు లేని విధానంలో ఇళ్లు..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌ఐజీ, ఎంఐజీ, హెచ్‌ఐజీ వర్గాలకు ఇళ్ల నిర్మాణాల కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ ఏర్పాటువరకు రాష్ట్రవ్యాప్తంగా 81,058 ఇళ్లు/ఫ్లాట్లు నిర్మించారు. వీటిలో ఎల్‌ఐజీ వర్గాల కోసమే దాదాపు 27,410 ఇళ్లను (250-400చ.అ.) నిర్మించగా, ఎంఐజీ కింద (400-650చ.అ.) 15,072; హెచ్‌ఐజీ కింద (800-1,400చ.అ.) 4,320 ఇళ్లను నిర్మించారు. రాజీవ్‌ గృహకల్ప కింద కూడా ఎల్‌ఐజీ కోసం 27,652 ఇళ్లను నిర్మించారు. ఇప్పుడు కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎల్‌ఐజీ, ఎంఐజీ వర్గాల కోసం గుర్తించిన స్థలాల్లో అపార్ట్‌మెంట్లను నిర్మిస్తారు. ఎల్‌ఐజీ వారికి రాయితీలు ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎల్‌ఐజీ కింద నిర్మించిన అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌కు భూమి ధరను రద్దు చేసి, రూ.5లక్షలను రాయితీ కింద ఇస్తారు. అంటే ప్రభుత్వం ఎల్‌ఐజీ వారికినిర్ణయించిన ధరలో ఇవిపోనూ మిగిలిన ధరకు ఇంటిని సొంతం చేసుకోవచ్చు. ఎంఐజీ వర్గాలకు మాత్రం అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు పూర్తయ్యాక నిర్మాణ ఖర్చును బట్టి ధరలను నిర్ణయించనున్నారు. అయితే వాటిని ‘లాభనష్టాలు లేని’ విధానంలోనే మధ్య ఆదాయ వర్గాలకు ఇవ్వనున్నట్లు తెలిసింది.

Updated Date - Jun 01 , 2026 | 04:58 AM