రూ.60 వేల కోట్లతో భారీ డేటా సెంటర్
ABN , Publish Date - Aug 06 , 2026 | 05:31 AM
తెలంగాణలో ఓ భారీ డేటా సెంటర్ పార్కు ఏర్పాటు కానుంది. రూ.60 వేల కోట్లతో.. 1,200-1,600 మెగావాట్ల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేసేందుకు ‘ఫార్చూన్ హాస్పిటాలిటీ అండ్ ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పీ’ సంస్థ ముందుకొచ్చింది.
1,200-1,600 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు
ముందుకొచ్చిన ఫార్చూన్ హాస్పిటాలిటీ అండ్ ఇన్‌ఫ్రా
సంస్థకు రంగారెడ్డి జిల్లాలో 170 ఎకరాల కేటాయింపు
ఎకరం రూ.4 కోట్ల చొప్పున కేటాయించిన సర్కారు
ప్రత్యక్షంగా 1000, పరోక్షంగా 4 వేల మందికి ఉపాధి
హైదరాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఓ భారీ డేటా సెంటర్ పార్కు ఏర్పాటు కానుంది. రూ.60 వేల కోట్లతో.. 1,200-1,600 మెగావాట్ల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేసేందుకు ‘ఫార్చూన్ హాస్పిటాలిటీ అండ్ ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పీ’ సంస్థ ముందుకొచ్చింది. ఇందుకోసం ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని తిమ్మాయిపల్లిలో టీజీఐఐసీకి చెందిన సర్వే నంబరు 9లోని 170 ఎకరాల భూమిని ఒక్కో ఎకరం రూ.4 కోట్ల చొప్పున ఈ సంస్థకు కేటాయించింది. అయితే ఫార్చూన్ కంపెనీకి చెందిన సోదర సంస్థ ‘సుదీక్ష ఎస్టేట్స్ ఎల్‌ఎల్‌పీ (స్పెషల్ పర్పస్ వెహికల్)’ ద్వారా డేటా సెంటర్ పార్కును ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని అతిపెద్ద డేటా సెంటర్ల క్లస్టర్లలో ఒకటిగా ఇది నిలుస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా 3-4 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. హైదరాబాద్ నగరం ఇప్పటికే దేశంలో ప్రముఖ డేటా సెంటర్ హబ్‌గా ఎదుగుతోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు భారీ ఎత్తున డేటా సెంటర్లను నెలకొల్పుతున్నాయి. ఇదే బాటలో మరికొన్ని కంపెనీలు కూడా ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఫార్చూన్ కంపెనీ కూడా రూ.60 వేల కోట్లతో డేటా సెంటర్ పార్కు ఏర్పాటుకు ముందుకొచ్చింది. 1,200-1,600 మెగావాట్ల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఈ ప్రాజెక్టుతో ఐటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, ఫిన్‌టెక్, విద్యుత్, ఫైబర్, డిజిటల్ సేవల రంగాలకు మరింత బలం చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచస్థాయి డేటా సెంటర్‌లను తెలంగాణకు రప్పించడం, ఫ్యూచర్ సిటీలో వాటిని ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ భారీ డేటా సెంటర్ పార్కుకు ప్రభుత్వం స్థలం కేటాయించిందని అధికార వర్గాలు తెలిపాయి.
వేలాది సర్వర్లతో డేటా సెంటర్ పార్కు..
డేటా అనేది ఇంటర్‌నెట్ ప్రపంచానికి అత్యంత కీలకమైనది. ఇప్పుడు ఎక్కడ చూసినా డేటా సెంటర్ల ఏర్పాటే అత్యంత ప్రధానంగా ఉంది. దీని ఏర్పాటుతో కంప్యూటర్ సర్వర్లు, స్టోరేజీ పరికరాలు, నెట్‌వర్క్ వ్యవస్థలను ఒకేచోట ఏర్పాటుచేసి డేటాను భద్రపరుస్తారు. మనం రోజూ వాడే వా ట్సాప్ నుంచి చాట్ జీపీటీ, యూట్యూబ్, గూగుల్ వెతికే అంశాల వరకు డేటా సెంటర్‌లదే కీలకపాత్ర. అయితే ప్రస్తుతం ఫార్చ్యూన్ సంస్థ.. డేటా సెంటర్ పార్కును ఏర్పాటు చేయనుంది. అంటే.. ఇది డేటా సెంటర్ కంటే పెద్దదన్నమాట. డేటా సెంటర్ పార్కులో చాలా డేటా సెంటర్ భవనాలు, విద్యుత్ వ్యవస్థలు, కూలింగ్ ప్లాంట్లు, ఫైబర్ నెట్‌వర్క్, భద్రతా వ్యవస్థలు, విదేశాలకు హై స్పీడ్ ఇంటర్‌నెట్ అందించే ప్రత్యేక వ్యవస్థ ఇందులో ఇమిడి ఉంటాయి. దేశంలో చాలావరకు డేటా సెంటర్లు 50-150 మెగావాట్ల సామఽర్ధ్యంతో ఉంటాయి. 300 మెగావాట్లు దాటితే దానిని మెగా డేటా సెంటర్‌గా పరిగణిస్తారు. 1,200-1,600 మెగావాట్ల సామర్ధ్యంతో డేటా సెంటర్ పార్కు అంటే.. ప్రపంచంలోని అతిపెద్ద డేటా సెంటర్ పార్కుల్లో ఒకటిగా నిలుస్తుందని కూడా అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. భారీ స్థాయి డేటా సెంటర్ల ఏర్పాటుతో అంతర్జాతీయ టెక్ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేందుకు అవకాశాలుంటాయని చెబుతున్నారు.