క్యూర్ పరిధిలో 10 అంతస్తుల్లో ఇందిరమ్మ ఇళ్లు
ABN , Publish Date - Jun 26 , 2026 | 05:00 AM
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లను అంతస్తుల వారీగా నిర్మిస్తామని, ఒక్కొక్కటి 10 అంతస్తులతో...
ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లను అంతస్తుల వారీగా నిర్మిస్తామని, ఒక్కొక్కటి 10 అంతస్తులతో ఉంటాయని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. గురువారం సచివాలయంలో క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల శాశ్వత భవనాల నిర్మాణం, భద్రాచలం దేవస్థానం అభివృద్ధి అంశాలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యూర్ పరిధిలో ఈ ఏడాది లక్ష ఇళ్ల నిర్మాణాలను లక్ష్యంగా పెట్టుకున్నామని, తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. క్యూర్ పరిధిలో 26 నియోజకవర్గాల్లో 20 చోట్ల స్థలాలు గుర్తించామని, ఈనెల 28 వరకు మిగిలిన ప్రాంతాల్లోనూ స్థలాలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి స్థలానికి సంబంధించిన డిజైన్లు, నిర్మాణ నమూనాలను కూడా సిద్ధం చేయాలన్నారు. ఇళ్లకు సంబంధించి విధివిధానాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వివరాలతో కూడిన బ్రోచర్‌ను జూలై మొదటి వారంలో విడుదల చేస్తామని వెల్లడించారు. ఇక రాష్ట్రంలో ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మిస్తున్నామని, వాటిని హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒకే మోడల్‌లో నిర్మించనున్నట్టు తెలిపారు. కలెక్టర్లతో సమన్వయం చేసుకుని పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయ భవనాల మరమ్మతులకు సంబంధించి హౌసింగ్ ఏఈలు ప్రతిపాదనలు పంపాలని సూచించారు.