Share News

రాష్ట్రంలో ఏప్రిల్‌ నుంచి ఎస్‌ఐఆర్‌

ABN , Publish Date - Mar 07 , 2026 | 03:42 AM

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన త్వరలోనే ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌...

రాష్ట్రంలో ఏప్రిల్‌ నుంచి ఎస్‌ఐఆర్‌

  • ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సీఈవోకు కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాలు

హైదరాబాద్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన త్వరలోనే ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను మన రాష్ట్రంలో ఏప్రిల్‌ నుంచి చేపట్టనున్నారు. ఇందుకుగాను ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశిస్తూ.. ఈసీఐ శుక్రవారం సర్క్యులర్‌ జారీ చేసింది. ఓటర్ల జాబితా సవరణ కోసం ఎన్నికల విభాగాలు సిద్ధం కావాలని, విధి విధానాల ప్రచారం, అవగాహన కార్యక్రమాలను ప్రక్రియ ప్రారంభం లోపు పూర్తిచేయాలని పేర్కొంది. ఏప్రిల్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ కోసం శిక్షణ కార్యక్రమాలు, బూత్‌స్థాయి అధికారుల నియామకం, క్షేత్రస్థాయి మ్యాపింగ్‌ పనులను తక్షణమే పూర్తి చేయాలని సూచించింది. కాగా, ఓటర్ల జాబితాను వంద శాతం దోష రహితంగా మార్చడమే లక్ష్యంగా ఎస్‌ఐఆర్‌ పేరిట సవరణను చేపట్టనున్నారు. సాధారణ ఓటర్ల సవరణలా కాకుండా ఎస్‌ఐఆర్‌లో బూత్‌స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) నేరుగా ఓటర్ల ఇళ్లకు వస్తారు. మరణించిన వారి పేర్లు, డూప్లికేట్‌ ఓట్లు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలసవెళ్లిన వారి వివరాలను జాబితా నుంచి తొలగిస్తారు. అలాగే 18 ఏళ్లు నిండిన యువతకు కొత్తగా ఓటు హక్కు కల్పిస్తారు. ఇంటింటి సర్వే నిర్వహించి ప్రతి ఓటరు ఫొటో, చిరునామా సరిచూస్తారు. ఈ భారీ కసరత్తు కోసం అధికార యంత్రాంగం ఇప్పుడే సిద్ధంకావాలని ఈసీఐ ఆదేశించింది. ఇప్పటికే బిహార్‌ వంటి రాష్ర్టాల్లో మొదటి దశ పూర్తికాగా, ప్రస్తుతం 12 రాష్ర్టాల్లో రెండోదశ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణతోపాటు నిర్దేశిత రాష్ట్రాల్లో ఏప్రిల్‌ నుంచి మూడోదశ ఎస్‌ఐఆర్‌ను ప్రారంభించనున్నారు.

Updated Date - Mar 07 , 2026 | 03:42 AM