Share News

భూముల రీసర్వే

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:18 AM

భూ సమస్యలు, భూ వివాదాలు లేని తెలంగాణను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సాగు భూములను రీ-సర్వే చేయించాలనే కీలక..

భూముల రీసర్వే

  • రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా నిర్వహిస్తాం

  • వచ్చే నెల నుంచే తొలిదశ

  • 2,240 గ్రామాల్లో నిర్వహణ

  • ప్రతి అంగుళం భూమికీ స్పష్టమైన హద్దులు

  • ప్రతి సర్వే నంబరుకు భూధార్‌.. రైతులకు భరోసా

  • సర్వే కోసం 411 రోవర్లు

  • త్వరలో మరో 400 కొంటాం

  • భూవివాదాల్లేని తెలంగాణే లక్ష్యం: పొంగులేటి

హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యలు, భూ వివాదాలు లేని తెలంగాణను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సాగు భూములను రీ-సర్వే చేయించాలనే కీలక నిర్ణయం తీసుకుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రీ-సర్వే కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి దశలవారీగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం రెవెన్యూ అధికారులతో మంత్రి టెలికాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 10,954 రెవెన్యూ గ్రామాల్లో తొలిదశలో హైదరాబాద్‌ మినహా 32 జిల్లాల నుంచి 70 గ్రామాల చొప్పున 2,240 గ్రామాలను ఎంపిక చేసి రీ- సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నంబరుకు భూధార్‌, ప్రతి రైతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 1936 నాటి నిజాం కాలం సర్వే రికార్డులే ప్రధాన ఆధారంగా ఉన్నాయని, కాలానుగుణంగా భూముల విభజనలు, ఉప సంఖ్యలు (బై నంబర్లు) పెరగడం, పట్టణీకరణ విస్తరణ, పారిపాలనా హద్దులు మారడం వల్ల అనేక ప్రాంతాల్లో భూముల హద్దులపై స్పష్టత లేదని వివరించారు. ఈ తరహా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సమగ్ర రీ సర్వే చేపడుతోందని తెలిపారు. భూ వివాదాల పరిష్కారంలో భాగంగా రాష్ట్రంలో నిజాం కాలం నుంచి నక్షాలు లేని 378 గ్రామాలు గుర్తించామని, వాటిలో ఇప్పటికే 5 గ్రామాల్లో రీ-సర్వే పూర్తి చేసి భూదార్‌ నంబర్లు కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన 373 గ్రామాల్లో కూడా రోవర్స్‌ వంటి ఆధునిక సాంకేతికతతో సర్వే కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటికే 411 రోవర్స్‌ కొనుగోలు చేయగా, త్వరలో మరో 400 కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. రీ సర్వే పూర్తయ్యాక ప్రతి భూ కమతానికి కచ్చితమైన హద్దులు నిర్ణయించి, ప్రతి సర్వే నంబరుకు ప్రత్యేక భూదార్‌ కేటాయిస్తామని తెలిపారు. 1948 నాటికి సుమారు 40 లక్షల సర్వే నంబర్లు ఉండగా ప్రస్తుతం అవి 2.29 కోట్లకు పెరిగాయన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 04:18 AM