త్వరలోనే 2 లక్షల కొత్త పింఛన్ల మంజూరు
ABN , Publish Date - May 14 , 2026 | 04:05 AM
చేయూత పథకం కింద 2 లక్షల కొత్త పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన నేపథ్యంలో అర్హులను గుర్తించేందుకు సంబంధిత విభాగాలు కసరత్తు ప్రారంభించాయి.
చేయూత పింఛన్లు.. లైవ్‌నెస్ ఆథెంటికేషన్‌కు శ్రీకారం
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): చేయూత పథకం కింద 2 లక్షల కొత్త పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన నేపథ్యంలో అర్హులను గుర్తించేందుకు సంబంధిత విభాగాలు కసరత్తు ప్రారంభించాయి. చేయూత పథకం కింద పెన్షన్లు పొందుతున్న లబ్థిదారులకు ‘లైవ్‌నెస్ ఆథెంటికేషన్’ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లైవ్‌నెస్ ఆథెంటికేషన్ ద్వారా అసలైన లబ్థిదారులను గుర్తించే ప్రక్రియను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, పురపాలక శాఖ అధికారులు, సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ) విభాగాలు చేపట్టనున్నాయి. వృద్థులు, మంచానికే పరిమితమైన వారు, దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తూ ఇంటి వద్దే వారి గుర్తింపు( డోర్ స్టెప్ వెరిఫికేషన్) చేపట్టనున్నారు. కాగా, సామాజిక భద్రతా పింఛన్లకు లైవ్ అథెంటికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఫేస్ రికగ్నీషన్ సాఫ్ట్‌వేర్ (ఎఫ్‌ఆర్‌ఎస్), బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ సాంకేతికతతో ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సూచిస్తూ... కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, డీఆర్డిఓలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోపక్క, లబ్థిదారుల జాబితా నుంచి మరణించిన వారి పేర్లను తొలగించే ముందు గ్రామసభ ఆమోదాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.