Share News

లక్ష జనాభా దాటితే..అదనపు తహసీల్దార్‌

ABN , Publish Date - May 08 , 2026 | 07:12 AM

లక్ష జనాభా దాటిన మండలాల్లో అవసరానికి అనుగుణంగా అదనంగా మరో తహసీల్దార్‌ను నియమించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

లక్ష జనాభా దాటితే..అదనపు తహసీల్దార్‌

  • అవసరాన్ని బట్టి ఆయా మండలాల్లో నియమిస్తాం

  • రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంతిల్లు కట్టిస్తాం

  • ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల సమీక్షలో మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, మే 7 (ఆంధ్ర జ్యోతి): లక్ష జనాభా దాటిన మండలాల్లో అవసరానికి అనుగుణంగా అదనంగా మరో తహసీల్దార్‌ను నియమించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గృహనిర్మాణం, రెవెన్యూ అంశాలపై ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో గురువారం హౌసింగ్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి సర్వే ద్వారానే రెవెన్యూ, అటవీ శాఖల మధ్య భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లును సమకూర్చడం, భూ యజమానులకు తమ భూమిపై స్పష్టమైన హక్కులను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి సొంత స్థలాల్లో ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల జారీలో ఎక్కడ పొరపాటు జరిగినా ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. గతంలో ఇళ్ల కోసం సేకరించిన భూమిలో ఖాళీ ఉంటే అర్హులైన పేదల ఇళ్ల కోసం కేటాయించాలని ఆదేశించారు. ఇళ్లు మంజూరై నిర్మాణం పూర్తి చేసుకోలేని లబ్ధిదారులకు వెసులుబాటు కల్పించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఏ దశలో ఉన్నా ఈ నెల 20వ తేదీలోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించారు.


ఆర్డీవోలు అధికార దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో శాసన మండలి చైౖర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం వైస్‌ చైౖర్మన్‌ జి.చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, 44 మంది ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్లు గురువారం హౌసింగ్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో పొంగులేటిని కలిశారు. నిజాయితీ, సేవాభావంతో పనిచేసి.. భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిగా నిలవాలని వారికి మంత్రి సూచించారు.

Updated Date - May 08 , 2026 | 07:12 AM