IT Minister Sridhar Babu: భవనాల క్రమబద్ధీకరణ ప్రకటిస్తాం
ABN , Publish Date - Jan 03 , 2026 | 03:52 AM
భవన క్రమబద్ధీకరణ పథకం(బీఆర్‌ఎస్) ప్రకటిస్తామని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. జీహెచ్‌ఎంసీ చట్టం సవరణలపై జరిగిన చర్చలో ఈ అంశాన్ని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్....
న్యాయపరమైన చిక్కులన్నీ త్వరలో పరిష్కరిస్తాం: శ్రీధర్‌బాబు
రాష్ట్రంలో మరో రెండు ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి
రంగారెడ్డి, భువనగిరి జిల్లాల్లో ఏర్పాటు
హైదరాబాద్, జనవరి 2(ఆంధ్రజ్యోతి): భవన క్రమబద్ధీకరణ పథకం(బీఆర్‌ఎస్) ప్రకటిస్తామని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. జీహెచ్‌ఎంసీ చట్టం సవరణలపై జరిగిన చర్చలో ఈ అంశాన్ని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ లేవనెత్తారు. నగరంలో వేలమంది తమ భవనాల క్రమబద్ధీకరణ కోసం వేచిచూస్తున్నారన్నారు. దీనిపై మంత్రి సమాధానమిస్తూ, విద్యుత్తు, నీటి సౌకర్యం పొందుతూ భవన నిర్మాణాల అనుమతి తీసుకోని కుటుంబాలు హైదరాబాద్‌లో పెద్దఎత్తున ఉన్నాయని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయుతే కొన్ని న్యాయపరమైన సమస్యలు ఉన్నందున వాటిని పరిష్కరిస్తున్నామని వివరించారు. సాధ్యమైనంత త్వరగా సమస్యలన్నీ పూర్తిచేసి బీఆర్‌ఎస్ ప్రకటిస్తామన్నారు. కొత్తగా వచ్చే 300 వార్డుల్లో సరిపడా ఉద్యోగులను నియమించాలని, లేకుంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని అక్బర్, బీజేపీ సభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి ప్రస్తావించారు. మొత్తం 300 వార్డుల్లో ఉద్యోగులను భర్తీ చేశాకే జీహెచ్‌ఎంసీ విభజనపై ముందుకు వెళ్తామని మంత్రి బదులిచ్చారు.
మరో రెండు ప్రైవేటు యునివర్సిటీలు
రాష్ట్రంలో మరో రెండు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం అనుమతించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి సమీపంలో అమిటీ విశ్వవిద్యాలయం, భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దేశ్‌ముఖీ గ్రామంలో సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యునివర్సిటీలు ఉన్నాయి. వైద్య ఆరోగ్య రంగానికి అనుబంధంగా రిహాబిలిటేషన్‌లో యుజీ, పీజీ, డాక్టరేట్ కోర్సులను సెయింట్ మేరీస్ వర్సిటీ అందించనుంది. 25 శాతం సీట్లను ప్రభుత్వం భర్తీ చేస్తుంది. రెండు వర్సిటీలలో రిజర్వేషన్ కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ పథకం అమలు చేయాలని సభ్యులు కోరారు.
మేం కూడా షేర్వానీతో వస్తాం: బీజేపీ
సభలో తమకు తగిన సమయం కేటాయించడం లేదని బీజేపీ పక్షనేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. షేర్వాణీలు వేసుకున్న వారు మాట్లాడితే కొనసాగిస్తున్నారని, తాము మాట్లాడితే సమయం తగ్గిస్తున్నారని ఎంఐఎం ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. షేర్వాణీలకే ప్రాధాన్యం అంటే తాము కూడా షేర్వానీలు వేసుకుని వస్తామని చెప్పారు.