Share News

పూడికతో జలాశయాల్లో తగ్గుతున్న నీటి నిల్వ

ABN , Publish Date - Jun 18 , 2026 | 05:44 AM

జలాశయాల్లో పూడిక తీత కోసం స్థిరమైన, శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

పూడికతో జలాశయాల్లో తగ్గుతున్న నీటి నిల్వ

  • శాస్త్రీయ విధానంలో తొలగింపు చేపట్టాలి

  • ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలి

  • తెలంగాణకు అన్వయం చేసుకోవాలి

  • నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి) : జలాశయాల్లో పూడిక తీత కోసం స్థిరమైన, శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలోని తన కార్యాలయంలో ఆయన అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పూడికతీత కోసం ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేసి, తెలంగాణలో అమలు చేయడానికి వీలుగా విధి విధానాలు రూపొందించాలని నిర్దేశించారు. కేంద్రప్రభుత్వం రూపొందించిన జాతీయ పూడిక తీత పాలసీని అన్వయం చేసుకొని, దీనిపై పూర్తిగా అధ్యయనం చేపట్టాలన్నారు. ఏయేటికాయేడు వరదతో పాటు వచ్చే పూడిక జలాశయాల నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గిస్తోందన్నారు. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్‌ జిల్లాలోని మంగళం ఆనకట్టలో 2017లో చేపట్టిన పూడిక తీత కార్యక్రమం సఫలీకృతమయిందన్నారు. శాస్ర్తీయ విధానంలో చేపట్టిన పనుల వల్ల అక్కడ పూడికతీత సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. కడెం ప్రాజెక్టులో పూడిక తొలగింపు పనులు చేపడుతున్న సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి సమీక్షించారు. లోయర్‌ మానేరు డ్యామ్‌(ఎల్‌ఎండీ), మిడ్‌ మానేరు రిజర్వాయర్‌(ఎంఎంఆర్‌)లలో జరుగుతున్న పూడిక తొలగింపు పనుల పురోగతిని మంత్రి ఆరా తీశారు. పనుల్లో వేగాన్ని పెంచడానికి వీలుగా, అడ్డంకులను తొలగించుకుంటూ ముందుకెళ్లాలన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు(ఎస్ఆర్‌ఎస్‌పీ), నిజాంసాగర్‌ ప్రాజెక్టుల్లో పూడిక ఏ మేరకు చేరిందనే అంశంపై అధ్యయనం చేసి, నివేదిక అందించాలన్నారు. జలాశయాల నిర్వహణలో శాస్ర్తీయ, దీర్ఘకాలిక దృక్పథాన్ని అవలంబించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వరద నియంత్రణ, నీటి సంరక్షణ, సాగునీటి స్థిరత్వం సాధనలో పూడిక తొలగింపును కీలక అంశంగా పరిగణిస్తూ ముందుకు సాగుతామని తెలిపారు. రాష్ట్రంలోని జలాశయాల్లో పూడిక తొలగింపు బాధ్యతలను ఈఎన్‌సీ(ఓ అండ్‌ ఎం)లకు అప్పగించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్‌, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌, ఈఎన్‌సీ రమే్‌షబాబు, ఈఎన్‌సీ(ఓఅండ్‌ ఎం) మధుసూదన్‌రావు, జాయింట్‌ సెక్రటరీ కె.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2026 | 05:44 AM