Share News

‘ఖరీదైన’అక్రమం

ABN , Publish Date - Jun 09 , 2026 | 05:04 AM

మెడికల్‌ షాపునకు వెళ్లినప్పుడు మనకు అవసరమైన ముందులేవో చెప్పి వాటిని కొంటాం.. అంతేకానీ, ‘మీ షాపులో ఎక్కువ ధరలున్న మందులేవి ఉన్నాయో చెప్పండి.

‘ఖరీదైన’అక్రమం

  • ఔషధాల కొనుగోళ్లలో టీజీఎంఎస్ఐడీసీ లీలలు

హైదరాబాద్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): మెడికల్‌ షాపునకు వెళ్లినప్పుడు మనకు అవసరమైన ముందులేవో చెప్పి వాటిని కొంటాం.. అంతేకానీ, ‘మీ షాపులో ఎక్కువ ధరలున్న మందులేవి ఉన్నాయో చెప్పండి. వాటిని కొంటా’ అని ఎవరైనా చెబుతారా? సాధారణ మనుషులు ఎవరూ అలాంటి పని చేయరు. కానీ, ‘తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ’ (టీజీఎంఎస్ఐడీసీ) మాత్రం అటువంటి వింత పనులు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు విజిలెన్స్‌ విభాగం పరిశీలనలో విస్తుపోయే అంశాలు వెల్లడయ్యాయి. ఔషధాలను కొనేటప్పుడు.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గత నాలుగైదు ఏళ్ల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేస్తుంటారు. కానీ టీజీఎంఎస్ఐడీసీ అధికారులు.. గతంలో అసలు వాడకమే లేని ఔషధాలను కోట్లాది రూపాయలు వెచ్చించి కొన్నారు. కొన్నందుకు వాటిని వినియోగించారా అంటే అదీ లేదు. దీంతో అవి ఎక్స్‌పైర్‌ అయ్యాయి. ఉదాహరణకు, రిటుక్సిమాబ్‌ అనే ఇంజక్షన్‌ను గత పదేళ్లలో ఒక్కసారి కూడా కొనలేదు. దీన్ని క్యాన్సర్‌ వైద్య నిపుణులు, రుమటాలజిస్టులు సిఫారసు చేస్తుంటారు. ఈసారి ఏకంగా 5,800 ఇంజక్షన్లను సుమారు రూ.3.58 కోట్లకు కొనుగోలు చేశారు. ఇందులో కేవలం రెండువేల ఇంజక్షన్లనే వినియోగించారు. మిగిలినవన్నీ ఎక్స్‌పైరీ అయ్యాయి. అలాగే టీకాగ్రేలర్‌ అనే ట్యాబ్లెట్లను గత పదేళ్లలో కేవలం ఐదువేలలోపు మాత్రమే వినియోగించారు. కానీ, ఈసారి డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ నుంచి 90 లక్షల ట్యాబ్లెట్లకు ఇండెంట్‌ రాగా.. 30 లక్షల ట్యాబ్లెట్స్‌ కొనుగోలు చేశారు. అలాగే 50/50 ఇన్స్‌లిన్‌ ఇంజక్షన్స్‌ను 9 లక్షల వయల్స్‌ను కొన్నారు. వీటిలో ఏకంగా ఐదు లక్షలు ఎక్స్‌పైరీ అయ్యాయి. 70/30 ఇన్సులిన్‌ ఇంజక్షన్స్‌ 3 లక్షలు కొనుగోలు చేసినట్లు సమాచారం. రూ.14కు దొరికే ఐరన్‌ సుక్రోజ్‌కు బదులు రూ.190 ఖరీదు చేసే ఫెర్రిక్‌ కార్బాక్సి మాల్టోస్‌ ఇంజక్షన్లను 3 లక్షలు కొనుగోలు చేశారు. గత పదేళ్లలో ఎఫ్‌సీఎమ్‌లను ఎప్పుడు కొనుగోలు చేయలేదని విజిలెన్స్‌ గుర్తించినట్లు సమాచారం. ఇటీవల హైదరాబాద్‌ సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపైనా విజిలెన్స్‌ ఆరా తీసినట్లు తెలిసింది. అక్కడ పెద్దమొత్తంలో ఎక్స్‌పైరీ ఔషధాలున్నట్లు తాము గుర్తించిన కొద్ది రోజులకే అగ్ని ప్రమాదం జరగడంపై లోతుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం.


మారిన పద్ధతి.. పెరిగిన అవినీతి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వినియోగించే ఔషధాల కోసం సంబంధిత విభాగాధిపతి హాస్పిటల్‌ ఫార్మసిస్టుకు సమాచారం ఇస్తారు. ఫార్మసిస్టు ఈ-ఔషధీ ద్వారా టీజీఎంఎస్ఐడీసీకి ఆన్‌లైన్‌లో ఇండెంట్‌ పెడతారు. రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీలు మొదలుకొని గాంధీ, ఉస్మానియా వరకు ఇదే విధంగా ఇండెంట్లు రావాలి. కానీ గతంలో కొందరు కార్పొరేషన్‌ ఉద్యోగులు ఈ విధానానికి బదులు విభాగాధిపతులే ఇండెంట్‌ పెట్టే పద్ధతిని తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఫార్మా కంపెనీలు, ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు హెచ్‌వోడీలతో చేతులు కలిపి తమకు కావల్సిన ఇండెంట్స్‌ను హెచ్‌వోడీల ద్వారా పెట్టించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. కావాల్సిన కంపెనీల కోసం టెండరు నిబంధనలను కూడా మార్చినట్లు, కొన్నింటికైతే ఏకంగా నిబంధనలను ఎత్తివేసినట్లు విజిలెన్స్‌ విచారణలో వెల్లడైంది.

కలకలం రేపిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం

టీజీఎంఎస్ఐడీసీ ఔషధ కొనుగోళ్లపై విజిలెన్స్‌ విచారణ మీద ‘ఆంధ్రజ్యోతి’లో సోమవారం ప్రచురితమైన కథనం వైద్య ఆరోగ్యశాఖలో కలకలం రేపింది. తమ సంస్థలో ఇంత భారీగా ఆర్థిక అక్రమాలు జరుగుతున్న వైనంపై కార్పొరేషన్‌ ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విజిలెన్స్‌ విచారణ ఎదుర్కొంటున్న అధికారుల బృందం మాత్రం తమకేం కాదన్న ధోరణితో ఉన్నారని, వారికి పైస్థాయి వారి అండదండలే కారణమని సిబ్బంది చెబుతున్నారు.

Updated Date - Jun 09 , 2026 | 05:04 AM