Share News

టీడీఆర్‌ సంస్కరణలు విప్లవాత్మకం

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:12 AM

ప్రభుత్వం ట్రాన్స్‌ఫరబుల్‌ డెవల్‌పమెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌) విధానంలో తెచ్చిన సవరణలు విప్లవాత్మకమని, ఈ సంస్కరణలు రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌లో గేమ్‌ చేంజర్‌గా నిలుస్తాయని నారెడ్కో ....

టీడీఆర్‌ సంస్కరణలు విప్లవాత్మకం

  • రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌లో గేమ్‌ చేంజర్‌.. నారెడ్కో తెలంగాణ ప్రతినిధులు

  • సీఎం గొప్ప దార్శనికతను చూపారు: మేక విజయసాయి

  • సరికొత్త సంస్కరణలతో మరింత ముందుకు: దామెర కాళీ ప్రసాద్‌, వై.కిరణ్‌

హైదరాబాద్‌ సిటీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ట్రాన్స్‌ఫరబుల్‌ డెవల్‌పమెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌) విధానంలో తెచ్చిన సవరణలు విప్లవాత్మకమని, ఈ సంస్కరణలు రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌లో గేమ్‌ చేంజర్‌గా నిలుస్తాయని నారెడ్కో తెలంగాణ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌ (నారెడ్కో) తెలంగాణ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారెడ్కో రాష్ట్ర అధ్యక్షుడు మేక విజయసాయి మాట్లాడుతూ.. ‘భవన నిర్మాణ నియమాలకు సంబంధించి మరింత హేతుబద్ధమైన విధానం కోసం రియల్‌ ఎస్టేట్‌ అసోసియేషన్లు చాలాకాలంగా ప్రభుత్వాలను కోరుతున్నాయి. 2012 తర్వాత భవన నిర్మాణ నియమాల్లో భవిష్యత్తు అవసరాలకనుగుణంగా గొప్ప దార్శనికతను సీఎం రేవంత్‌రెడ్డి చూపారు. టీడీఆర్‌లో సంస్కరణలు వేగవంతమైన పట్టణీకరణకు నాంది పలుకుతాయి. జీవో 95 ఒక సాధారణ సవరణ మాత్రమే కాదు.. రియల్‌ ఎస్టేట్‌ వృద్థిలో తదుపరి దశకు ఉత్ర్పేరకం’ అని తెలిపారు. డెవలపర్లపై పెట్టుబడి భారం తగ్గించడానికి చర్యలు చేపట్టారని, దీంతో అందుబాటు ధరలో ఇళ్లు లభిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీఆర్‌కు విలువ పెంచేలా చర్యలు తీసుకున్నారని, దీంతో రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన సామాన్యులకు చాలా ప్రయోజనకరమని తెలిపారు. ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణం, రోడ్డు విస్తరణ శరవేగంగా సాగుతుందన్నారు. నారెడ్కో ఉపాధ్యక్షులు దామెర కాళీ ప్రసాద్‌, డాక్టర్‌ వై.కిరణ్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రంగం దృఢంగా ఉండేందుకు గుణాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. హైదరాబాద్‌లో గత మూడు నెలల్లో జరిగిన రిజిస్ర్టేషన్లు మార్కెట్‌ స్థిర వృద్ధిని తెలియజేస్తున్నాయని, సరికొత్త సంస్కరణలతో మరింత ముందుకు వెళ్తుందని తెలిపారు. నారెడ్కో ప్రధాన కార్యదర్శి కె.శ్రీధర్‌రెడ్డి, ట్రెజరర్‌ ఆర్‌.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ టీడీఆర్‌ విధాన సంస్కరణలతో గ్రేటర్‌ శివారులోనేకాకుండా కోర్‌ సిటీలో గణనీయమైన వృద్ధి వస్తుందన్నారు. ప్లాటు విస్తీర్ణం 2 వేల చదరపు మీటర్లకు మించి ఉండే ఏరియాకు 40 అడుగుల రోడ్డు ఉంటే టీడీఆర్‌తో రెండు ఫ్లోర్లకు బదులు మూడు ఫ్లోర్లు వేసుకొచ్చని, 80 అడుగుల రోడ్డు ఉండే చోట రెండు ఫ్లోర్లు కాకుండా ఐదు ఫ్లోర్లకు అనుమతివ్వడం మంచి పరిణామమని తెలిపారు.

Updated Date - Mar 24 , 2026 | 05:12 AM