ఏప్రిల్‌లో రూ.10,598 కోట్ల పన్ను రాబడి
ABN , Publish Date - Jun 02 , 2026 | 04:59 AM
2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో రాష్ట్రానికి పన్నుల ద్వారా రూ.10,598.33 కోట్ల రాబడి సమకూరింది. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే...
గతేడాది కంటే 2.91 శాతం తగ్గుదల : కాగ్ నివేదిక
హైదరాబాద్, జూన్1 (ఆంధ్రజ్యోతి): 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో రాష్ట్రానికి పన్నుల ద్వారా రూ.10,598.33 కోట్ల రాబడి సమకూరింది. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే రాబడి 2.91 శాతం మేర తగ్గింది. రెవెన్యూ రాబడుల మొత్తంలో కూడా స్వల్ప తగ్గుదల నమోదైంది. రాష్ట్ర రాబడి, వ్యయాలకు సంబంధించి ఏప్రిల్ నెల నివేదికను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) సోమవారం విడుదల చేసింది. దాని ప్రకారం.. వస్తు సేవల పన్ను, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ సుంకాలు, కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర రాష్ట్ర పన్నులు, సుంకాలన్నింటి ద్వారా ఏప్రిల్ నెలలో రూ.10,598.33 కోట్లు సమకూరాయి. గతేడాది ఏప్రిల్ నెలలో రూ.10,916.68 కోట్లు వచ్చాయి. అంటే గతేడాది కంటే ఈసారి రూ.318.35 కోట్లు(2.91శాతం) రాబడి తగ్గింది. కాగా, పన్నులతో పాటు పన్నేతరాలు, కేంద్ర గ్రాంట్లు-కాంట్రిబ్యూషన్లు కూడా కలిపితే మొత్తం రెవెన్యూ రాబడుల కింద రూ.10,974.73 కోట్లు సమకూరాయి. గతేడాది ఏప్రిల్‌లో సమకూరిన రెవెన్యూ రాబడులు రూ.11,239.13 కోట్ల కంటే ఇది రూ.264.4 కోట్లు(2.35శాతం) తక్కువ. ఇక, ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం రూ.11,413 కోట్ల నికర అప్పును సేకరించింది. పన్నులు, పన్నేతరాలు, కేంద్ర గ్రాంట్లు, అప్పులు వంటి అన్ని రకాల రాబడుల కింద రాష్ట్రానికి ఏప్రిల్ నెలలో మొత్తం రూ.22,392.28 కోట్లు సమకూరాయి. అయితే, అన్ని రకాల వ్యయాల కింద ప్రభుత్వం రూ.21,472.31 కోట్లను ఖర్చు చేసింది. ఇందులో రెవెన్యూ వ్యయం కింద రూ.6080.69 కోట్లు, వడ్డీ చెల్లింపులకు రూ.2350.90 కోట్లు, ఉద్యోగుల జీత భత్యాలకు రూ.4449.24 కోట్లు, పెన్షన్ల కోసం రూ.1893.11 కోట్లు, సబ్సిడీలకు రూ.4727.38 కోట్లు వెచ్చించింది.