ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా తెలంగాణ: శ్రీధర్‌బాబు
ABN , Publish Date - May 16 , 2026 | 04:51 AM
తెలంగాణ రాష్ట్రాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
సంగారెడ్డిలో కేజేఎస్ ఇండియా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి శంకుస్థాపన
పాల్గొన ్న మంత్రి దామోదర, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి/కొండాపూర్, మే 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను నెలకొల్పి స్థానిక యువతకు, ముఖ్యంగా మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించడంపై ప్రత్యేకదృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్‌పల్లిలో రూ.650 కోట్లతో నిర్మించనున్న కేజేఎస్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు శుక్రవారం మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ శంకుస్థాపన చేశారు. 44 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పనున్న ఈ పరిశ్రమ ద్వారా 1500 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుండగా.. ఇందులో సుమారు వెయ్యి మంది మహిళలు ఉండడం అభినందనీయమని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పారిశ్రామిక రంగాన్ని ముందుచూపుతో పరుగులు తీయిస్తున్నారని, హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు అవతల వ్యవసాయాఽధారిత పరిశ్రమలను నెలకొల్పేలా చర్యలు చేపట్టారని వివరించారు. అనంతరం దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సంగారెడ్డి ప్రాంతంలో భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చిన కేజేఎస్ ఇండియా యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ప్రసంగిస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల సహకారం వల్లనే ఈ పరిశ్రమ సాకారమైందన్నారు. ఈ కార్యక్రమంలో కేజేఎస్ ఇండియా చైర్మన్ గిరీష్ జైన్, ఎంపీలు రఘునందన్‌రావు, సురేశ్‌షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.