Share News

టార్గెట్‌ 2.50 కోట్ల పనిదినాలు!

ABN , Publish Date - Apr 10 , 2026 | 04:59 AM

ఈ నెలలో ఉపాధి హామీ కూలీలకు అధిక సంఖ్యలో పని కల్పించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ సంబంధిత విభాగాలను పరుగులు పెట్టిస్తోంది.

టార్గెట్‌ 2.50 కోట్ల పనిదినాలు!

  • ఈ నెలలో మిగిలింది ఇంకా 20 రోజులే..

  • ఉపాధి పనిదినాల లక్ష్యం పూర్తికి పీఆర్‌ శాఖ కసరత్తు

  • ఎక్కువ మంది కూలీలకు పని కల్పించిన మేట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లకు నగదు ప్రోత్సాహకం

  • ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలోనూ ఉపాధి కూలీలు

  • పీఆర్‌ శాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ రోజువారీ సమీక్షలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ఈ నెలలో ఉపాధి హామీ కూలీలకు అధిక సంఖ్యలో పని కల్పించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ సంబంధిత విభాగాలను పరుగులు పెట్టిస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో ఏప్రిల్‌ నుంచి అమలు చేయాల్సిన వికసిత్‌ భారత్‌ జీ రామ్‌ జీ (వీబీ జీరామ్‌జీ) పథకాన్ని కేంద్రం తాత్కాలికంగా వాయిదా వేసింది. ఈ పథకం మే, జూన్‌లో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూలీలకు ఉపాధి కల్పనలో భాగంగా ఏప్రిల్‌ నెలకుగాను తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 2.50 కోట్ల పని దినాలను కేటాయించింది. దీంతో ఈ పనిదినాలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. అధిక సంఖ్యలో కూలీలను ఉపాధి పనికి రప్పించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చే యాలంటే ప్రతిరోజు 8.50 లక్షల మందికిపైగా కూలీలకు పని కల్పించాల్సి ఉంటుంది. అయితే వేసవి పరిస్థితులు, ఇతర కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 3 లక్షల మందే ఉపాధి పనులకు వస్తున్నారు. ఎక్కువ మందిని పనికి రప్పించేలా పీఆర్‌ శాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ జిల్లాల డీఆర్‌డీవో, ఎంపీడీవోలతో రోజువారీగా వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు.


ఎక్కువ మందికి పనికల్పిస్తే నగదు ప్రోత్సాహకం

ఉపాధిహామీ పథకం విధానాలు, పేరు మారనున్నవేళ కేంద్రం మన రాష్ట్రానికి కేటాయుంచిన పనిదినాల లక్ష్యాన్ని చేరేందుకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఎక్కువ మంది కూలీలకు పని కల్పించేలా క్షేత్రస్థాయి విభాగాలకు పీఆర్‌ శాఖ ఉన్నతాధికారులు సూచనలు చేస్తున్నారు. గ్రామాల్లో ఎక్కువ మంది కూలీలకు పని కల్పించి.. ఎన్‌ఎంఎంఎస్ యాప్‌ ద్వారా ఫేషియల్‌ హాజరు అధిక సంఖ్యలో నమోదు చేసే మేట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్ల (ఎఫ్‌ఏ)కు రూ.1,000 నగదు ప్రోత్సాహకంతోపాటు సంబంధిత జిల్లా అధికారుల ద్వారా సత్కరించడం వంటి వినూత్న కార్యాచరణను అమలు చేస్తున్నారు. కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ రోజువారీగా అన్ని జిల్లాల అధికారులతో ఆన్‌లైన్‌ ద్వారా ఉపాధి పనులపై సమీక్షలు చేస్తున్నారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా జరిపిన సమీక్షలో అందించిన సమాచారం మేరకు ఆదిలాబాద్‌ జిల్లా గాదిగూడ మండలం కొలామా గ్రామానికి చెందిన దయానంద్‌ అనే ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గురువారం 312 మంది కూలీలకు ఎన్‌ఎంఎంఎ్‌స ద్వారా హాజరు నమోదు చేశారు. దీంతో ఆ జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ఆయనకు రూ.1,000 నగదు ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఇలా ప్రతిరోజు అధిక లక్ష్యాలు సాధించిన ఎఫ్‌ఏలు, మేట్లను ప్రోత్సహించి లక్ష్యాన్ని సాధించేలా పీఆర్‌శాఖ ప్రయత్నాలు చేస్తోంది. కూలీల హాజరు కోసం కేంద్రం తెచ్చిన నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌(ఎన్‌ఎంఎంఎ్‌స) విధానం ద్వారా పనికి వచ్చిన వారి ఫేషియల్‌ హాజరు నమోదు చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్‌ నెట్‌వర్క్‌ సరిగాలేకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో కూలీల హాజరుకు ఆటంకం ఏర్పడుతోంది. దీన్ని అధిగమించడంపై అధికారులు దృష్టిసారించారు. అటెండెన్స్‌ నమోదు చేసే మేట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లను నగదు ప్రోత్సాహకంతోపాటు మెరుగైన పనితీరు కలిగిన వారితో ఇతరులకు అవగాహన కల్పిస్తున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలోనూ...

ఇంకుడు గుంతల తవ్వకం, హరితహారం వంటి పనులతో కూలీలకు ఎక్కువ రోజులు పని కల్పించేందుకు సంబంధిత విభాగాలు కృషి చేస్తున్నాయి. కేంద్రం మార్గదర్శకాలకు లోబడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలోనే ఉపాధిహామీ కూలీలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈమేరకు పలు జిల్లాల్లో కార్యాచరణ మొదలుపెట్టారు. 2.50 కోట్ల పనిదినాల లక్ష్యాన్ని చేరుకునేందుకు నీటి కుంటల పూడికతీత, పిచ్చిమొక్కల తొలగింపు వంటి పనులను సైతం చేపడుతున్నారు.

Updated Date - Apr 10 , 2026 | 04:59 AM