Share News

తెలంగాణ ‘స్వచ్ఛ’ వ్యూహం అమోఘం

ABN , Publish Date - Jun 30 , 2026 | 05:13 AM

తెలంగాణ ప్రభుత్వం ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పట్టణాల్లో చేపట్టిన పరిశుద్థ నగరాల కార్యక్రమంపై కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల...

తెలంగాణ ‘స్వచ్ఛ’ వ్యూహం అమోఘం

  • ప్రజల భాగస్వామ్యం ఆదర్శం ప్రశంసించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పట్టణాల్లో చేపట్టిన పరిశుద్థ నగరాల కార్యక్రమంపై కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రశంసలు కురిపించింది. ‘స్వచ్ఛ్‌ భారత్‌ మిషన్‌ అర్బన్‌ 2.0’ (ఎస్‌బీఎమ్‌-యూ 2.0) లక్ష్యాలను అందుకోవడంలో తెలంగాణ అనుసరిస్తున్న వ్యూహాలు, సాధించిన ఫలితాలు దేశంలోని మిగతా రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా నిలిచాయని ప్రశంసించింది. స్వచ్ఛతను కేవలం ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా, ప్రజల రోజువారీ అలవాట్లలో భాగం చేస్తూ తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని కేంద్రం కొనియాడింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన 100 రోజుల ప్రత్యేక ప్రచారం ద్వారా క్షేత్రస్థాయిలో వచ్చిన మార్పును ఒక విజయవంతమైన మోడల్‌గా పేర్కొంది. పట్టణాలను శుభ్రంగా ఉంచుకోవడంలో జనం నిత్యం సహకరిస్తుండడంతో, ‘స్వచ్ఛ్‌ భారత్‌ మిషన్‌ అర్బన్‌ 2.0’ కింద తెలంగాణ నగరాలు, పట్టణాలు వేగంగా మారిపోతున్నాయని తెలిపింది. స్వచ్ఛ భారత్‌ ఉద్యమం మొదలైనప్పుడు 250 కిలోమీటర్ల మేర జరిగిన ర్యాలీల్లో 36,900 మంది పౌరులు పాల్గొనడం ప్రజల బాధ్యతకు నిదర్శనమని కేంద్రం తెలిపింది. దాదాపు 27.09 లక్షల ఇళ్లను సందర్శించి.. తడి-పొడి చెత్తను వేరు చేయడం, ఇంట్లోనే ఎరువు తయారు చేసుకునే పద్థతులపై అవగాహన కల్పించడాన్ని ప్రశంసించింది. ‘అమృత్‌ మిత్ర’ ప్రోగ్రామ్‌లో 10,704 మంది మహిళల సాయంతో 24,708 మొక్కలు నాటడం ద్వారా మహిళా సాధికారతను, పర్యావరణాన్ని ముడిపెట్టిన తీరును కేంద్రం ప్రత్యేకంగా ప్రస్తావించింది. 18,351 కి.మీ మేర వరద నీటి కాలవలు, నాలాలను శుభ్రం చేయడం ద్వారా పట్టణాల్లో మురుగు నీటి ముప్పును, సీజనల్‌ వ్యాధులను అరికట్టడంలో తెలంగాణ భేష్‌ అనిపించుకుందని ప్రశంసించింది. స్వచ్ఛతను స్థానిక ఆర్థిక వనరులతో ముడిపెడుతూ 8,546 మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌జిహెచ్‌జీ) రూ.1,045.04 కోట్ల మేర రుణాల పంపిణీ చేయడం, స్ర్టీట్‌ ఫూడ్‌ ఫెస్టివల్స్‌ ద్వారా రూ.177.12 లక్షల అమ్మకాలు సాధించడం అభినందనీయమని కేంద్రం పేర్కొంది.

Updated Date - Jun 30 , 2026 | 05:13 AM