ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ నిలుపుదల
ABN , Publish Date - May 06 , 2026 | 05:52 AM
ఇంటర్ ప్రవేశాల ప్రక్రియకు బ్రేక్ పడింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, గురుకులాల్లో ఈ నెల 8 నుంచి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించాలని..
ఇంటర్ విద్యలో సంస్కరణల అమలు లక్ష్యంతోనే నిర్ణయం
ప్రకటించిన ఇంటర్ విద్య కార్యదర్శి అభిలాష
పాఠశాల విద్యలో బోర్డు విలీనం?
12వ తరగతి వరకు పాఠశాల విద్య?
దోస్త్ తరహాలోనే ఇంటర్‌లోనూ ప్రవేశాలు?
వీటిలో కొన్ని ఈ సారి నుంచి అమలు?
హైదరాబాద్, మే 5(ఆంధ్రజ్యోతి): ఇంటర్ ప్రవేశాల ప్రక్రియకు బ్రేక్ పడింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, గురుకులాల్లో ఈ నెల 8 నుంచి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించాలని, జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ఇంటర్ విద్య కార్యదర్శి అభిలాష సోమవారం ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. 24 గంటల్లోపే వాటిని నిలుపుదల చేస్తూ అభిలాష మంగళవారం మరో ఉత్తర్వు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేదాక ప్రవేశాలు చేపట్టవద్దని అందులో స్పష్టం చేశారు. ఇంటర్ విద్యలో కొన్ని సంస్కరణలు అమలు చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టబోయే సంస్కరణలపై చర్చ నడుస్తోంది. పలుచోట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్యాంప్‌సలోనే జూనియర్ కాలేజీలు కూడా ఉన్నాయి. అలాగే కొత్త విద్యాసంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు కానున్నాయి. ఇందులో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బోధన ఉంటుంది. ఒకే క్యాంప్‌సలో 12వ తరగతి వరకు ఉన్న చోట్ల ప్రవేశాలు ప్రత్యేకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. పాఠశాల విద్య 12వ తరగతి వరకు ఉండాలని జాతీయ విద్యా విధానంలో పొందుపరిచారు. ఇదే విషయాన్ని రాష్ట్ర విద్యా కమిషన్ సైతం ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
పది తర్వాత ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ బోర్డు పరీక్షలు ఉండటంతో విద్యార్థులపై ఒత్తిడి తీవ్రంగా ఉంటోందని, దీనిని తగ్గించేందుకు ఫస్టియర్ బోర్డు పరీక్షలు తొలగించాలని విద్యా కమిషన్ సూచించింది. ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయాలని, డిగ్రీలో దోస్త్ తరహాలోనే ఇంటర్లోనూ ఆన్‌లైన్ ప్రవేశాలు చేపట్టే ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇందులో కొన్ని సంస్కరణలను మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న కొత్త విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది.