64 శాతం ఎస్టీ కొలాం కుటుంబాలకు కుళాయిలు, మరుగుదొడ్లు లేవు
ABN , Publish Date - Apr 16 , 2026 | 04:29 AM
రాష్ట్రంలో ప్రాథమిక సౌకర్యాలైన తాగునీరు, మరుగుదొడ్ల లభ్యతలో కులాల మధ్య తీవ్ర అసమానతలు ఉన్నట్లు తాజా సర్వే వెల్లడించింది.
హైదరాబాద్, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రాథమిక సౌకర్యాలైన తాగునీరు, మరుగుదొడ్ల లభ్యతలో కులాల మధ్య తీవ్ర అసమానతలు ఉన్నట్లు తాజా సర్వే వెల్లడించింది. రాష్ట్ర సగటుతో పోలిస్తే కొన్ని వర్గాల్లో సౌకర్యాల లేమి చాలా ఎక్కువ ఉంది. కుళాయి నీరు అందుబాటులో లేని కుటుంబాల సగటు సుమారు 20 శాతంగా ఉండగా.. కులాల మధ్య వ్యత్యాసం మాత్రం గణనీయంగా ఉన్నట్లు వెల్లడైంది. ఎస్టీ కొలాం సమాజంలో 64.7 శాతం కుటుంబాలకు ట్యాప్ వాటర్ అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇది రాష్ట్ర సగటుతో పోలిస్తే మూడింతలు ఎక్కువ. బీసీ-డీ మాలీలు, ఎస్సీ మహర్లు, ఎస్టీ గోండులు వంటి వర్గాల్లో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉంది. మరోవైపు, ఓసీ జైన్లలో కేవలం 3.2 శాతం కుటుంబాలకే ట్యాప్ వాటర్ లేకపోవడం కనిపించింది. ఓసీ లింగాయత్‌లు, రాజులు, బ్రాహ్మణులు, కోమట్లు, రెడ్లు వంటి వర్గాల్లో కూడా ఈ శాతం చాలా తక్కువగా ఉంది. ఇది ఈ వర్గాల్లో మెరుగైన జీవన పరిస్థితులను సూచిస్తోంది. రాష్ట్రంలో మరుగుదొడ్లు లేని కుటుంబాల సగటు 13.3 శాతంగా ఉన్నప్పటికీ, కులాల మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంది. ఎస్టీ కొలాం వర్గంలో 64 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు. ఇది రాష్ట్ర సగటుతో పోలిస్తే దాదాపు ఐదింతలు ఎక్కువ. ఎస్టీ గోండులు, బీసీ-డీ మాలీలు, ఎస్సీ మహర్లు, ఎస్టీ కోయలు, ఎస్సీ మాలా సాలే వర్గాల్లో కూడా ఈ సమస్య తీవ్రంగానే ఉంది. అదే సమయంలో ఓసీ బ్రాహ్మణుల్లో కేవలం 2.8 శాతం కుటుంబాలకే మరుగుదొడ్లు లేవు. కోమట్లు, కాపులు, రాజులు, కమ్మలు, జైన్ల వంటి వర్గాల్లో కూడా పరిస్థితి మెరుగ్గా ఉంది. బీసీ వర్గాల్లో పరిస్థితి మిశ్రమంగా కనిపిస్తోంది. కొన్ని ఉప వర్గాలు (బీసీ-బీ గోల్డ్‌స్మిత్స్, బీసీ-సీ క్రిస్టియన్లు) తక్కువ లోటుతో ఉండగా, బీసీ-ఏ, బీసీ-డీ వర్గాల్లో మాత్రం సౌకర్యాల కొరత ఎక్కువగా ఉంది.