Share News

తెలంగాణలో మతిమరుపు ముప్పు!

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:45 AM

తెలంగాణ ప్రజలు డిమెన్షియా వ్యాధి బారిన పడే ముప్పు రోజురోజుకు పెరుగుతోందని హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌....

తెలంగాణలో మతిమరుపు ముప్పు!

  • పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే సమస్య అధికం.. గ్రామీణంలో డిమెన్షియా ముంగిట 60ుశాతం మంది

  • పట్టణ ప్రాంత ప్రజల్లో ఈ రిస్క్‌ జోన్‌లో 27శాతం మంది

హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజలు డిమెన్షియా వ్యాధి బారిన పడే ముప్పు రోజురోజుకు పెరుగుతోందని హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌(నిన్‌) పరిశోధకులు సంయుక్తంగా చేసిన అధ్యయనంలో తేలింది. పోషకాహార లోపం కారణంగా ప్రజలు డిమెన్షియా బారిన పడే అవకాశం ఉందని, ఈ సమస్య తీవ్రత పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం హెచ్చరించింది. తెలంగాణలో 40-80ఏళ్ల మధ్య వయస్సున్న 556 మంది పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలపై 2023-24 మధ్యలో ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనం ప్రకారం.. ఈ 556 మందిలో 39శాతం మంది అంటే ప్రతీ 10మందిలో నలుగురు భవిష్యత్తులో డిమెన్షియా బారిన పడే అవకాశం ఉంది. ఇది పట్టణ ప్రాంత ప్రజల్లో 27శాతంగా, గ్రామీణ ప్రాంత ప్రజల్లో 60శాతంగా ఉంది. సాధారణంగా నగరాల్లో ఉండేవారికి శారీరక శ్రమ లేకపోవడం వల్ల వ్యాధులు వస్తాయని అనుకుంటారు. కానీ, ఈ అధ్యయనం ఆశ్చర్యకరమైన నిజాలను బయటపెట్టింది. పల్లెల్లో ఉండేవారిలో పోషకాహార లోపం, విటమిన్ల కొరత వల్ల వారు డిమెన్షియా ముప్పును ఎక్కువగా ఎదుర్కొంటున్నారని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రోజూ ఒకే తరహా ఆహారాన్ని తీసుకోవడం, పోషకాలతో కూడిన రకరకాల కూరగాయలు, పండ్లను తినకపోవడమే వారిలో డిమెన్షియా ముప్పు పెరగడానికి కారణం అవుతోందని పరిశోధకులు విశ్లేషించారు. ఈ పరిశోధన వివరాలు అంతర్జాతీయ వైద్య జర్నల్‌ ది లాన్సెట్‌లో ప్రచురితమయ్యాయి.

64శాతం మందిలో బీ2 లోపం

డిమెన్షియా ముప్పును పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఎదుర్కొంటున్నారని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. మహిళల్లో 55శాతం మంది, పురుషుల్లో 45శాతం మంది ఈ రిస్కు గ్రూపులో ఉన్నారు. కాగా, డిమెన్షియా వచ్చే ముప్పు ఎక్కువగా ఉన్నవారిలో విటమిన్‌ డీ, విటమిన్‌ బీ2(రైబోఫ్లేవిన్‌), విటమిన్‌ బీ6, ఫోలేట్‌(బీ9)లు చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో 64శాతం మందిలో బీ2లోపం ఉంది. 42శాతం మందిలో విటమిన్‌ డీ లోపం ఉంది. 34శాతం మందిలో విటమిన్‌ బీ 6 లోపం ఉండగా, 17శాతం మందిలో (ముఖ్యంగా శాకాహారుల్లో) బీ12 లోపం ఉన్నట్లు బయటపడింది. శరీరంలో ఈ విటమిన్ల స్థాయి పడిపోతున్న కొద్దీ మతిమరుపు సమస్య పెరుగుతోందని అధ్యయనం వివరించింది.


ఏయే విటమిన్లు ఎక్కడెక్కడ..

ఎముకలు బలపడటానికే కాకుండా మెదడు కణాలు సరిగ్గా కమ్యూనికేట్‌ అవ్వడానికి దోహదపడే విటమిన్‌ డీ రావాలంటే ఉదయం ఎండలో నిలబడటం, గుడ్డు సొన, పుట్టగొడుగులు, పాలు వంటివి తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్‌ బి12 మెదడు పరిమాణం కుంచించుకుపోకుండా, నరాల చుట్టూ ఉండే రక్షణ పొర దెబ్బతినకుండా చూస్తుందని, పాలు, పెరుగు, పనీర్‌, గుడ్లు తినడం వల్ల ఈ విటమిన్‌ లోపం నుంచి గట్టెక్కవచ్చన్నారు. విటమిన్‌ బి6 మెదడులోని రసాయన సమాచార వ్యవస్థ సజావుగా సాగడానికి, కణాలకు శక్తిని ఇవ్వడానికి తోడ్పడుతుంది. ఇది లోపిస్తే మూడ్‌ స్వింగ్స్‌, డిప్రెషన్‌ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆకుకూరలు, అరటిపండ్లు, శనగలు, బంగాళాదుంపలు, బాదం, వేరుశనగలు, పాల ఉత్పత్తుల్లో ఈ విటమిన్‌ పుష్కలంగా లభిస్తుంది.

మందుల్లేవు.. పోషకాహారమే పరిష్కారం

డిమెన్షియా లేదా అల్జీమర్స్‌ వ్యాధిని పూర్తిగా నయం చేసే కచ్చితమైన మందులు ప్రస్తుతానికి లేవని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆహారంలో మార్పుల ద్వారానే వ్యాధి రాకుండా జాగ్రత్తపడవచ్చని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన పరిశోధకులు డాక్టర్‌ భానుప్రకాష్‌ రెడ్డి, ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ భారతి కులకర్ణి స్పష్టం చేశారు. రోజువారీ మెనూలో కేవలం అన్నం, కూర కాకుండా.. రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు ఉండేలా చూసుకుంటే డిమెన్షియా నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 04:45 AM