Share News

జూన్‌ 15లోగావిద్యార్థులకు సామగ్రి

ABN , Publish Date - May 01 , 2026 | 05:38 AM

విద్యార్థులకు అందించే నోటు పుస్తకాలు, ట్రంక్‌ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, ట్రాక్‌ సూట్లు, బెడ్‌ షీట్లు, స్కూల్‌ బ్యాగ్‌లు, ఐడీ కార్డులు, యూనిఫామ్‌లన్నీ నాణ్యమైనవే సేకరించాలని, వీటి నాణ్యతలో ...

జూన్‌ 15లోగావిద్యార్థులకు సామగ్రి

  • సేకరణ కోసం కేంద్రీకృత విధానం అమలు

  • నాణ్యతలో రాజీ వద్దు.. సకాలంలో అందాలి

  • నాణ్యతపై విద్యార్థుల ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలి

  • అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం

  • కార్మికుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం

  • మేడే శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు అందించే నోటు పుస్తకాలు, ట్రంక్‌ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, ట్రాక్‌ సూట్లు, బెడ్‌ షీట్లు, స్కూల్‌ బ్యాగ్‌లు, ఐడీ కార్డులు, యూనిఫామ్‌లన్నీ నాణ్యమైనవే సేకరించాలని, వీటి నాణ్యతలో రాజీ ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. నాణ్యతతో పాటు సకాలంలో అందించడంపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు చెప్పారు. జూన్‌ 15 నాటికి విద్యార్థులకు అవసరమైన సామగ్రి అంతా అందాలని, అందగానే సరఫరాదారులకు చెల్లింపులు పూర్తి చేస్తామని తెలిపారు. విద్యాశాఖతో పాటు బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలు, ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని విద్యా సంస్థల విద్యార్థులకు అందజేసే సామగ్రి సేకరణకు కేంద్రీకృత విధానం అనుసరించాలని ఆదేశించారు. గురువారం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గతంలో విద్యార్థులకు అందజేసే సామాగ్రిని ఏ శాఖకు ఆ శాఖ కొనుగోలు చేయడంతో ఏకరూపత లోపించడంతోపాటు అక్రమాలు చోటుచేసుకునేవని, వాటిని అరికట్టి, జవాబుదారీతనం కోసం కేంద్రీకృత సేకరణ విధానం తీసుకొచ్చామని చెప్పారు. అటువంటి అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులకు అందజేసే వస్తువులకు సంబంధించి మండల స్థాయిలో ఒక నోడల్‌ అధికారిని నియమించాలని సూచించారు. అక్కడి నుంచి గ్రామాల్లోని పాఠశాలలు, హాస్టళ్లకు వస్తువులు సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని, సరఫరాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీయించాలన్నారు.పుస్తకాలు, యూనిఫాం, ఇతర సామగ్రి నాణ్యతపై విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖల మధ్య స మన్వయానికి కమిటీని నియమించాలని ఆదేశించారు.

Updated Date - May 01 , 2026 | 05:38 AM