విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తారా?
ABN , Publish Date - Apr 04 , 2026 | 05:39 AM
విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని హైకోర్టు తీర్పునివ్వడం అన్యాయమని ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. పేద విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దని....
హైకోర్టు తీర్పు అన్యాయం: ఆర్.కృష్ణయ్య
బీసీ మంత్రులు రాజీనామా చేయాలి: జాజుల
తీర్పుపై పునరాలోచన చేయాలి: ఏఐఎస్ఎఫ్
హైదరాబాద్/బర్కత్‌పుర, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని హైకోర్టు తీర్పునివ్వడం అన్యాయమని ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. పేద విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ బెంచ్ ముందు అప్పీల్‌కు వెళ్లాలన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ విద్యార్థి సంఘం నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సర్కారు సరైన వాదనలు వినిపించకపోవడం, అడ్వొకేట్ జనరల్ అసమర్థత వల్లే ఈ తీర్పు వచ్చిందని ఆరోపించారు. ఏజీని తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్ బకాయిలను రూ.8 వేలకోట్లను సర్కారు తక్షణమే విడుదల చేయాలని, లేకపోతే పాలనను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. హైకోర్టు తీర్పు పేద విద్యార్థుల పాలిట మరణశాసనంగా మారిందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వంలోని బీసీ మంత్రులు నోరు మెదపకపోవడం సరికాదన్నారు. బీసీ ప్రయోజనాలు కాపాడలేని మంత్రులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో పోరాడి సాధించుకున్న రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. హైకోర్టు తీర్పు పేద, మధ్య తరగతి విద్యార్థులకు వ్యతిరేకంగా ఉందని.. తీర్పుపై పునరాలోచన చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ఆధారపడే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని గుర్తు చేశారు. బకాయిలు చెల్లించకుండా నాలుగేళ్లుగా ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయన్నారు.