మన వాటానూ వాడుకోలేకపోతున్నాం
ABN , Publish Date - Jan 21 , 2026 | 05:07 AM
కృష్ణా జలాల్లో ప్రస్తుత నీటి సంవత్సరం(2025 జూన్ 1నుంచి ఇప్పటివరకు) ఏపీ 632.69 టీఎంసీలు వాడుకోగా తెలంగాణ 159.51 టీఎంసీలతో సరిపెట్టుకుంది.
కృష్ణా జలాల్లో కోటా పూర్తి చేయని తెలంగాణ
ఏపీ వినియోగం 632 టీఎంసీలు, తెలంగాణ వాడకం 159 టీఎంసీలు
హైదరాబాద్, జనవరి20 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల్లో ప్రస్తుత నీటి సంవత్సరం(2025 జూన్ 1నుంచి ఇప్పటివరకు) ఏపీ 632.69 టీఎంసీలు వాడుకోగా తెలంగాణ 159.51 టీఎంసీలతో సరిపెట్టుకుంది. కృష్ణా బేసిన్‌లోని కీలకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకాలు పూర్తికాకపోవడం, శ్రీశైలం లెఫ్ట్‌బ్యాంక్ టన్నెల్ ప్రాజెక్టు గట్టెక్కకపోవడం, రాజీవ్ బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు కూడా పెండింగ్‌లో ఉండిపోవడంతో కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ముందుకెళ్లడం లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో తాత్కాలిక సర్దుబాటు పేరుతో 811 టీఎంసీల్లో ఏపీ512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వాడుకోవాలని ఒప్పందం కుదిరింది. ఒక్క ఏడాదికే ఈ ఒప్పందం చేసుకున్నప్పటికీ 2022దాకా ఈ ఒప్పందం కొనసాగింది. ఈ తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఉన్న కోటాను కూడా తెలంగాణ చేరుకోలేదు. ఈ వాటర్ ఇయర్‌లో నిష్పత్తి ప్రకారం చూస్తే ఏపీ 79.86 శాతం, తెలంగాణ 20.14 శాతం జలాలను మాత్రమే వినియోగించుకున్నాయి. మరోవైపు ఉమ్మడి జలాశయాల్లో నీటినిల్వలు తగ్గిపోతుండడంతో ఆ నిల్వలను కాపాడాలని కృష్ణాబోర్డును తెలంగాణ కోరింది. కృష్ణా జలాలను వాటాకు మించి ఏపీ తరలించకుండా నియంత్రించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ (జనరల్) మహ్మద్ అంజద్ హుస్సేన్ కృష్ణాబోర్డుకు వరుసగా రెండోసారి లేఖ రాశారు. రానున్న జూన్‌లో వర్షాలు ప్రారంభమయ్యే వరకు ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, సాగర్‌లో ఉన్న నీటి నిల్వలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని, లేకుంటే తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.