Share News

రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం!

ABN , Publish Date - Jan 28 , 2026 | 03:52 AM

రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రాబడులు, వ్యయాలు, మిగిలిపోయిన పనులకు అవసరమైన నిధులు, ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బంది సంఖ్య, వారికయ్యే జీత భత్యాల వ్యయం తదితర అంశాలతో....

రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం!

  • అంచనాలను రూపొందించిన శాఖలు.. ఇప్పటికే ఆర్థిక శాఖకు చేరిన అంచనాలు

  • మేడారం సందర్శన తర్వాతే భట్టి సమీక్షలు

  • శాసనసభ సమావేశాలు, సీఎం, డిప్యూటీ సీఎం పర్యటనలతో సమీక్షలకు జాప్యం

హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రాబడులు, వ్యయాలు, మిగిలిపోయిన పనులకు అవసరమైన నిధులు, ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బంది సంఖ్య, వారికయ్యే జీత భత్యాల వ్యయం తదితర అంశాలతో ప్రభుత్వ శాఖలు అంచనాలను రూపొందించాయి. ఈ మేరకు ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు ప్రతిపాదనలను పరిశీలించి, తగిన రిమార్కులతో ఆర్థిక శాఖకు సమర్పించారు. కానీ, వీటిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించాల్సి ఉంది. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి కూడా సమీక్షిస్తారు. వాస్తవానికి శాఖల వారీగా ప్రతిపాదనలపై ఈ చివరి వారంలోనే భట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహించాల్సి ఉండగా, సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో ఉండడం, డిప్యూటీ సీఎం కూడా ఆదిలాబాద్‌ జిల్లాలోని కేస్లాపూర్‌ నాగోబా జాతరను సందర్శించడం, మంగళవారం తన మధిర నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ప్రారంభం కాలేదు. బుధవారం నుంచి మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానుంది. భట్టి విక్రమార్క ఈ జాతరను సందర్శించనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. మేడారం జాతర నుంచి తిరిగి వచ్చిన తర్వాత బడ్జెట్‌ ప్రతిపాదనలపై సమీక్షలు ప్రారంభిస్తారని సమాచారం. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాతే సమీక్షలు ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది.

శాఖల వారీగా సమీక్షల్లోనూ జాప్యమే

2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తమ బడ్జెట్‌ అంచనాలను రూపొందించి పంపించాలంటూ ఆర్థిక శాఖ అన్ని శాఖలను ఆదేశించింది. ఈ నెల 3 లోపు తమ శాఖల ముఖ్యకార్యదర్శులకు పంపాలంటూ విభాగాధిపతులకు సూచించింది. అనంతరం వాటిని పరిశీలించి, తగిన రిమార్కులతో ఈ నెల 6 లోపు ఆర్థిక శాఖ ‘ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం(ఐఎ్‌ఫఎంఐఎ్‌స)’లో ఆన్‌లైన్‌ పద్ధతిలో సమర్పించాలని తెలిపింది. ఆ మేరకు అన్ని శాఖలు అంచనాలను రూపొందించాయి. ఈ అంచనాలన్నీ ఆర్థిక శాఖకు చేరాయి. కానీ, వీటిపై శాఖల వారీగా సమీక్షలు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు.

జాప్యానికి కారణాలివీ....

డిసెంబరు 29న ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జనవరి 7 వరకు కొనసాగాయి. ఆ తర్వాత మంత్రులు కాస్త విశ్రాంతిలోకి వెళ్లారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని సందర్శించి, అక్కడే ఒక రోజు బస చేసి, పనులపై సమీక్ష చేశారు. దాంతో మంత్రులు, వివిధ శాఖల అధికారులు అక్కడి పనుల్లోనే నిమగ్నమయ్యారు. అనంతరం అక్కడి నుంచి ఈ నెల 20న సీఎం దావోస్‌ పర్యటనకు వెళ్లారు. సీఎం వెంటనే మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటిలతో పాటు వివిధ శాఖలకు చెందిన కొంత మంది ఉన్నతాధికారులు కూడా వెళ్లారు. దీంతో బడ్జెట్‌ ప్రతిపాదనలపై సమీక్షలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Jan 28 , 2026 | 03:52 AM