Share News

16 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

ABN , Publish Date - Mar 08 , 2026 | 05:13 AM

రాష్ట్ర శాసనసభ, శాసనమండలి బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి.

16 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

  • పునరుద్ధరించిన శాసనమండలి నేడు ప్రారంభం

హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభ, శాసనమండలి బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్‌ ఆదేశాల మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసిన అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి.. 16వ తేదీ ఉదయం 11.45 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయని తెలిపారు. తొలి రోజు శాసనసభ, శాసన మండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. ఆ మరుసటి రోజు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-227) వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 20న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్నది. ఇటీవల జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఈ నెల 30 వరకూ సమావేశాలు జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొంటారు.

Updated Date - Mar 08 , 2026 | 05:13 AM