Share News

క్రీడల్లో రాణిస్తే కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం

ABN , Publish Date - Jul 10 , 2026 | 05:39 AM

రాష్ట్రంలో క్రీడా రంగానికి పునర్వైభవం తీసుకొస్తామని, ఎలాంటి ప్రభుత్వ, రాజకీయ జోక్యం లేకుండా క్రీడారంగం అభివృద్ధికి చర్యలు చేపడతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

క్రీడల్లో రాణిస్తే కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం

  • ప్రభుత్వ, రాజకీయ జోక్యం లేకుండా రాష్ట్రంలో క్రీడలు, క్రీడా వర్సిటీ నిర్వహణ

  • రాష్ట్రంలో పదేళ్లపాటు క్రీడలపై నిర్లక్ష్యం

  • నిజమైన క్రీడాకారులకు అన్యాయం

  • 2028 డిసెంబరులో గచ్చిబౌలి స్పోర్ట్స్‌ డిస్ట్రిక్ట్‌, క్రీడా వర్సిటీ ప్రారంభిస్తాం: రేవంత్‌

  • స్పోర్ట్స్‌ వర్సిటీ లోగో ఆవిష్కరణ

  • సీఎం రేవంత్‌కు పీటీ ఉష అభినందనలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): రాష్ట్రంలో క్రీడా రంగానికి పునర్వైభవం తీసుకొస్తామని, ఎలాంటి ప్రభుత్వ, రాజకీయ జోక్యం లేకుండా క్రీడారంగం అభివృద్ధికి చర్యలు చేపడతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టుగా హైదరాబాద్‌ను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు, ఎంపీ పీటీ ఉషతో కలిసి యంగ్‌ ఇండియా క్రీడా విశ్వవిద్యాలయం లోగో, వెబ్‌సైట్‌, గచ్చిబౌలి క్రీడా జిల్లా ప్రాజెక్టు నమూనాలను రేవంత్‌రెడ్డి గురువారం ఆవిష్కరించి.. మాట్లాడారు. 2000వ దశకంలో జాతీయ క్రీడలు, ఆఫ్రో-ఏషియన్‌ గేమ్స్‌, ప్రపంచ మిలిటరీ క్రీడలు వంటి ప్రతిష్ఠాత్మక పోటీలకు ఆతిథ్యమిచ్చిన ఘనత హైదరాబాద్‌కు ఉందని గుర్తుచేశారు. తర్వాత రెండు దశాబ్దాల పాటు నగరంలో, రాష్ట్రంలో ఎలాంటి జాతీయ, అంతర్జాతీయ క్రీడోత్సవాలను నిర్వహించలేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక పదేళ్ల పాటు స్టేడియాలను పెళ్లిళ్లు, విందులకు ఫంక్షన్‌ హాళ్లుగా, సభలకు వేదికగా మార్చారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చే వరకు రాష్ట్రానికి క్రీడా పాలసీ లేదన్నారు. కేంద్ర క్రీడా మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయను స్వయంగా కలిసి విజ్ఞప్తి చేయడంతో.. ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ వంటి జాతీయ స్థాయి పోటీలకు ఆతిథ్యమిచ్చే అవకాశం హైదరాబాద్‌కు వచ్చిందని చెప్పారు. 25 క్రీడాంశాల్లో ఏడు వేల మందికిపైగా క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీలను వచ్చే నవంబరులో హైదరాబాద్‌ వేదికగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తామన్నారు.


ప్రభుత్వ జోక్యం లేకుండా వర్సిటీ నిర్వహణ

క్రీడా విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ, రాజకీయ నాయకుల జోక్యం ఉండదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయం పనితీరును స్పోర్ట్స్‌ బోర్డు, దాని సభ్యులు కపిల్‌ దేవ్‌, సంజీవ్‌ గోయెంకా, కొణిదెల ఉపాసన, కావ్య మారన్‌, రవికాంత్‌రెడ్డి, ఇతర డైరెక్టర్లే పర్యవేక్షిస్తారని తెలిపారు. వర్సిటీని పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తామని, పూర్తి స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తుందని వివరించారు. 2028 డిసెంబరులో యూనివర్సిటీని, గచ్చిబౌలి స్పోర్ట్స్‌ డిస్ట్రిక్ట్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణ కంటే చిన్నగా ఉండే దక్షిణ కొరియా ఒలింపిక్స్‌లో పదులకొద్దీ పతకాలు సాధిస్తుంటే.. 140 కోట్ల మంది ఉన్న భారత్‌ పతకాలు సాధించకపోవడం బాధాకరమన్నారు. ఇన్నాళ్లూ సరైన క్రీడా విధానం లేక క్రీడాకారులను గుర్తించడంలో అన్యాయం జరిగిందని, ఇకపై అలాంటి పొరపాట్లకు తావుండదని చెప్పారు.

క్రీడల్లో ప్రతిభ చూపితే ప్రభుత్వ ఉద్యోగం

చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయో? లేదో తెలియదుగానీ.. దేశానికి పతకాలు అందిస్తే కచ్చితంగా సర్కారు కొలువు ఇస్తామని సీఎం రేవంత్‌ హామీ ఇచ్చారు. క్రికెటర్‌ సిరాజ్‌, నిఖత్‌ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. పారా అథ్లెట్‌ దీప్తికి గ్రూప్‌-2 ఉద్యోగం ఇచ్చామని, త్వరలో ఒలింపియన్‌ ఇషాసింగ్‌కు కూడా ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.

ఆటగాళ్లకు చెక్కులు

గత రెండేళ్లలో వివిధ అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటిన తెలంగాణ క్రీడాకారులకు రూ.7.15 కోట్ల చెక్కులను సీఎం రేవంత్‌రెడ్డి అందజేశారు. షూటర్లు ఇషాసింగ్‌కు రూ.3.30 కోట్లు, తనిష్క్‌ మురళీధర్‌ నాయుడుకు రూ.53.65 లక్షలు, సురభి భరద్వాజ్‌కు రూ.10 లక్షలు, గతేడాది జరిగిన బధిర ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు నెగ్గిన ధనూష్‌ శ్రీకాంత్‌కు రూ.2.10 కోట్లు, బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు రూ.60 లక్షలు, ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ పోటీల్లో పతకం నెగ్గిన జీవాంజి దీప్తికి రూ.50 లక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ క్రీడాశాఖ సలహాదారులు ఏపీ జితేందర్‌రెడ్డి, శాట్‌ చైర్మన్‌ కె.శివసేనారెడ్డి, ప్రముఖ క్రీడాకారులు శ్యామ్‌ సుందర్‌, గోపీచంద్‌, ఇస్మాయిల్‌ బేగ్‌, రమేశ్‌, రవికాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


రేవంత్‌కు పీటీ ఉష అభినందనలు

క్రీడా విశ్వవిద్యాలయాన్ని, గచ్చిబౌలి స్పోర్ట్స్‌ డిస్ట్రిక్ట్‌ను ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డిని పీటీ ఉష అభినందించారు. భారత్‌ క్రీడాదేశంగా మారాలన్నది ప్రధాని మోదీ సంకల్పమని, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా పని చేస్తుండటం అభినందనీయమని చెప్పారు. భారత ఒలింపిక్‌ సంఘం తరఫున రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

క్రీడా శాఖతో పలు సంస్థల ఒప్పందాలు

  • నైపుణ్యాల అభివృద్ధి కోసం కేంద్ర క్రీడాశాఖ ఏర్పాటు చేసిన ‘మై భారత్‌’ అనే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థతో రాష్ట్ర క్రీడా శాఖ ఒప్పందం చేసుకుంది.

  • రాష్ట్రంలో ప్రతిభావంతులైన పారా అథ్లెట్లను గుర్తించేందుకు ‘టాలెంట్‌ ఐడెంటిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ పారా అథ్లెట్స్‌’ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఆదిత్య మెహతా ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకుంది.

  • తెలంగాణ ‘స్పోర్ట్స్‌ నాలెడ్జ్‌ ఆన్‌ వీల్స్‌’, యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ ఫెలోషిప్‌, ఫిజికల్‌ లిటరసీ కార్యక్రమాలను కూడా అధికారికంగా ప్రారంభించారు.

Updated Date - Jul 10 , 2026 | 05:40 AM