Share News

స్పేస్‌ రేసులో తెలంగాణ

ABN , Publish Date - Aug 07 , 2026 | 05:50 AM

రోజురోజుకూ వినూత్న సాంకేతికతలతో దూసుకుపోతున్న అంతరిక్ష రంగంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది.

స్పేస్‌ రేసులో తెలంగాణ

  • అంతరిక్ష విధానంపై సర్కారు కసరత్తు

  • 23న ‘నేషనల్‌ స్పేస్‌ డే’ సందర్భంగా

  • కొత్త పాలసీ గురించి ప్రకటించే అవకాశం

  • అంతరిక్ష రంగ స్టార్ట్‌పలకు మరిన్ని అవకాశాలు, భారీ పెట్టుబడులకు చర్యలు

హైదరాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): రోజురోజుకూ వినూత్న సాంకేతికతలతో దూసుకుపోతున్న అంతరిక్ష రంగంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఇన్నాళ్లూ సెమీ కండక్టర్లు, డేటా సెంటర్లు, జీసీసీలు, రక్షణ రంగాల పెట్టుబడులను ప్రోత్సహించగా.. ఇకపై తెలంగాణను స్పేస్‌ టెక్‌ కేంద్రంగా మార్చే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా ‘స్పేస్‌ పాలసీ’ తీసుకువచ్చేందుకు కసరత్తు చేపట్టింది. ఈ నెల 23న నేషనల్‌ స్పేస్‌ డే సందర్భంగా రాష్ట్ర విధానాన్ని ప్రకటించేందుకు ఐటీ శాఖ రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ప్రాథమిక ముసాయిదాను సిద్ధం చేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైనట్టు తెలిసింది.


స్పేస్‌ స్టార్ట్‌పలకు ప్రత్యేక రాయితీలు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగం వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల కేంద్రం స్పేస్‌ పాలసీని ప్రకటించడం, ప్రైవేటురంగానికీ అవకాశం కల్పించిన నేపథ్యంలో మనదేశంలోనూ ఊపు కనిపిస్తోంది. భారీగా పెట్టుబడులు, కంపెనీలు తరలివచ్చే అవకాశం ఏర్పడింది. ఈ క్రమంలో తెలంగాణను స్పేస్‌ రేసులో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర పాలసీ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో అమల్లో విధానాలను పరిశీలించి.. తెలంగాణ కోసం అత్యుత్తమమైన ప్రత్యేక స్పేస్‌ పాలసీని తీసుకువచ్చేలా కసరత్తు జరుగుతోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే స్కైరూట్‌ ఏరోస్పేస్‌, ధ్రువ్‌ స్పేస్‌ సహా పలు అంతరిక్ష రంగ స్టార్ట్‌పలు ఉన్నాయి. అలాంటి మరెన్నో స్టార్ట్‌పలను, అంతరిక్ష రంగ పరికరాలు, విడిభాగాలను తయారు చేసే పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం స్టార్ట్‌పలకు ప్రారంభ పెట్టుబడి, రాయితీలు, భూముల కేటాయింపు, సింగిల్‌ విండో అనుమతులు, పరిశోధనలకు అవసరమైన సహకారం, స్పేస్‌ టెక్నాలజీకి అవసరమైన ప్రత్యేక ఇంక్యుబేటర్‌ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలను పరిశీలిస్తోంది.ప్రధానంగా ఉపగ్రహాలు, అనుబంధ వ్యవస్థలు, పేలోడ్‌లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాలు, విడిభాగాల తయారీ యూనిట్లకు అవసరమైన భూముల కేటాయింపు విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ఫ్యూచర్‌సిటీలో స్పేస్‌ పార్కు లేదా స్పేస్‌ క్లస్టర్‌ ఏర్పాటుచేసే అవకాశం ఉందని అంటున్నాయి.


23న స్పేస్‌ పాలసీపై ప్రకటన!

ఈ నెల 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా తెలంగాణ స్పేస్‌ పాలసీపై ప్రకటన చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటర్‌ క్లాస్‌ రాకెట్‌ ‘విక్రమ్‌-1’ను విజయవంతంగా ప్రయోగించిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ వ్యవస్థాపకులు నాగభరత్‌ డాకా, పవన్‌కుమార్‌ చందన సమక్షంలో స్పేస్‌ పాలసీ ప్రకటన ఉండవచ్చని అంటున్నాయి. దీనిపై వారితో ఐటీ శాఖ అధికారులు సంప్రదింపులు జరపనున్నారని, పాలసీ రూపకల్పనలో వారి సలహాలు, సూచనలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నాయి.

Updated Date - Aug 07 , 2026 | 05:53 AM