Share News

పంద్రాగస్టున స్మార్ట్‌ రేషన్‌ కార్డులు!

ABN , Publish Date - Aug 07 , 2026 | 05:54 AM

రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రత కార్డు లబ్ధిదారులకు సర్కారు ‘స్మార్ట్‌ రేషన్‌ కార్డులు’ ఇవ్వనుంది. ఈ మేరకు 1.05 కోట్ల కుటుంబాలకు ఆగస్టు 15న కార్డులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

పంద్రాగస్టున స్మార్ట్‌ రేషన్‌ కార్డులు!

  • 1.05 కోట్ల కుటుంబాలకు పంపిణీ

  • సంగారెడ్డిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌

  • అదేరోజు 119 నియోజకవర్గాల్లో అందజేత

  • డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ తరహాలో రూపకల్పన

  • పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలని

  • అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రత కార్డు లబ్ధిదారులకు సర్కారు ‘స్మార్ట్‌ రేషన్‌ కార్డులు’ ఇవ్వనుంది. ఈ మేరకు 1.05 కోట్ల కుటుంబాలకు ఆగస్టు 15న కార్డులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రేషన్‌ లబ్ధిదారులకు ప్రత్యేకంగా కార్డులంటూ ఏమీ ఇవ్వలేదు. గత లబ్ధిదారులు, కొత్తగా ఎంపికైన లబ్ధిదారులు ఆహార భద్రత కార్డులను ఆన్‌లైన్‌ ద్వారా జిరాక్స్‌ తీసుకొని, లామినేట్‌ చేసి దాన్నే కార్డుగా వినియోగిస్తున్నారు. తాజాగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం.. పాత, కొత్త రేషన్‌ కార్డుదారులందరికీ కూడా స్మార్ట్‌ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు నమూనాలను పరిశీలించి.. కార్డుల డిజైన్‌ పూర్తి చేసింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహనాల ఆర్‌సీ, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల తరహాలోనే సార్ట్‌ రేషన్‌ కార్డులను తయారు చేయించింది. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంగారెడ్డిలో లాంఛనంగా ప్రారంభిస్తారు. సంప్రదాయం ప్రకారం.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సాయం త్రం లోక్‌ భవన్‌లో ‘ఎట్‌ హోం’ నిర్వహిస్తారు. సాయంత్రం 5:30కు జరిగే ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. దీంతో సంగారెడ్డిలో సీఎం చేతుల మీదుగా స్మార్ట్‌ కార్డుల పంపిణీని సంగారెడ్డిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా నిర్వహించేలా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఒకేసారి స్మార్ట్‌ కార్డుల పంపిణీ ప్రారంభించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో డివిజన్‌ స్థాయిలో ఆర్డీవోలు, జిల్లా పరిపాలన, పౌరసరఫరాలశాఖ అధికారులు సమన్వయంతో కార్యక్రమం చేపట్టాలని, కార్డుల పంపిణీకి పక్కా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. కొన్ని మార్గదర్శకాలనూ ఆయన జారీచేశారు. నియోజకవర్గాల వారీగా రేషన్‌ కార్డుల లబ్ధిదారుల జాబితాలు రూపొందించాలని, వెరిఫికేషన్‌ చేయాలని సూచించారు.


స్మార్ట్‌ రేషన్‌ కార్డుల ముద్రణ, సురక్షితంగా నిల్వచేయటం, రవాణా చేయటం, సకాలంలో పంపిణీ కేంద్రాలకు చేర్చటంలో అధికారులు పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, ఇతర అనుబంధ శాఖల అధికారులు స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పంపిణీ వేదికలు కూడా ప్రజలకు అనువుగా ఉండాలని, టెంట్లు, కుర్చీలు, తాగునీరు, బారికేడ్లు, మైక్‌సెట్లు, లబ్ధిదారులు పేర్లు నమోదుచేసుకోవటానికి రిజిస్ట్రేషన్‌, వెరిఫికేషన్‌, క్రమ పద్ధతిలో పంపిణీ చేయటానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. పత్రికలు, టీవీ చానళ్లలో విస్తృత ప్రచారం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రేషన్‌కార్డుల పంపిణీ పూర్తిచేశాక ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సూచించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయటానికి రేషన్‌ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా పథకాన్ని అమలుచేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ సంక్షేమ పాలనలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Aug 07 , 2026 | 05:55 AM