కృష్ణా నీళ్లను ఏపీ దోచుకుంటుంటే..రేవంత్ చోద్యం చూస్తున్నారు
ABN , Publish Date - Feb 11 , 2026 | 02:28 AM
కృష్ణా జలాలను ఏపీ దోచుకెళ్తుంటే సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ప్యాలె్‌సలో కూర్చొని చోద్యం చూస్తున్నారని బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు.
చంద్రబాబు, రేవంత్ మధ్య ఫెవికాల్ బంధం ఉంటే రాష్ట్రం హక్కులు రాసిస్తారా?
తెలంగాణ గొంతు కోస్తున్న కాంగ్రెస్, బీజేపీ
త్వరలో కృష్ణా బోర్డు ఆఫీసు ముట్టడి: హరీశ్
హైదరాబాద్, పిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాలను ఏపీ దోచుకెళ్తుంటే సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ప్యాలె్‌సలో కూర్చొని చోద్యం చూస్తున్నారని బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు. జనవరి 29 నాటికి ఏపీ 664 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకుందన్నారు. తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఏపీ 66 శాతమే వాడాల్సి ఉండగా 80 శాతం వినియోగిస్తుంటే రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి గడ్డి పీకుతున్నారా అని ప్రశ్నించారు. ఇండెంట్లు, కృష్ణా బోర్డు అనుమతులు లేకుండానే ఏపీ ఇష్టారాజ్యంగా నీళ్లను తీసుకుపోతోందన్నారు. మన రాష్ట్ర వాటా 33 శాతం(174 టీఎంసీలు)లో ఇప్పటి వరకు 20 శాతం మాత్రమే వాడుకున్నారన్నారు. ‘తెలంగాణలో పంటలు, పరిశ్రమల నీటి అవసరాలను పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా? సర్కారు నడుపుతున్నారా.. సర్కస్ నడుపుతున్నారా?’ అని ప్రశ్నించారు. వరుసగా రెండేళ్లలో అతి తక్కువ కృష్ణా జలాలను వినియోగించి రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకున్నారని, ఈ రాష్ట్రానికి సీఎం శాపంలా మారారన్నారు. చంద్రబాబు, రేవంత్ మధ్య ఫెవికాల్ బంధం ఉన్నంత మాత్రాన రాష్ట్ర హక్కులను ఆంధ్రాకు ఎందుకు రాసిస్తున్నారని అడిగారు. అడ్డగోలుగా ఏపీకి నీళ్లు తరలిస్తూ తెలంగాణ రైతుల నోళ్లు కొడుతున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ కలిసి తెలంగాణ గొంతుకోస్తున్నాయని విమర్శించారు. ఆర్‌ఆర్ టాక్స్, స్కాంలు బయటపడతాయనే భయంతో రేవంత్ రెడ్డి కేంద్రం దగ్గర నోరు విప్పడం లేదని ఆరోపించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేవలం కేసీఆర్ మీద పడి ఏడవడం తప్ప తెలంగాణ హక్కుల కోసం ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కృష్ణా బోర్డు లెక్కల్లోనూ మాయాజాలం కనబడుతోందని, ఏపీ 664 టీఎంసీలు వాడుకుందని మన అధికారులు లెక్కలు చూపిస్తే.. కృష్ణా బోర్డు మాత్రం 555 టీఎంసీలేనని చెబుతోందని, మిగతా 100 టీఎంసీల వెనక మర్మం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తే బీఆర్‌ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, త్వరలో కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు.