ట్యాపింగ్ బాధ్యులెవరు?
ABN , Publish Date - Feb 01 , 2026 | 06:59 AM
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కేసీఆర్ విచారణ సిట్‌కు అత్యంత కీలకంగా మారనుంది. అనధికార, అక్రమ ఫోన్ ట్యాపింగ్‌కు బాధ్యులెవరన్న అంశాన్ని నిర్ధారించుకోవడానికి కేసీఆర్ విచారణను ఒక అవకాశంగా మలచుకోనుంది.
మావోయిస్టుల వంకతో వ్యక్తుల్ని ట్యాప్ చేస్తున్నారని తెలుసా?
రిటైరైన ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌ను ఎందుకు కొనసాగించారు?
ఆ ఇద్దరు అధికారులూ తరచూ మిమ్మల్ని కలిసేవారా?
కేసీఆర్‌కు ప్రశ్నలు సిద్ధం చేసిన సిట్
హైదరాబాద్, జనవరి 31(ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కేసీఆర్ విచారణ సిట్‌కు అత్యంత కీలకంగా మారనుంది. అనధికార, అక్రమ ఫోన్ ట్యాపింగ్‌కు బాధ్యులెవరన్న అంశాన్ని నిర్ధారించుకోవడానికి కేసీఆర్ విచారణను ఒక అవకాశంగా మలచుకోనుంది. ఇప్పటి వరకు అరెస్టు అయిన టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఎస్‌ఐబీ అధికారులు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలు విచారణలో అంగీకరించిన విషయాలను వారి వాంగ్మూలాల ఆధారంగా, కస్టడీలో ఉన్నపుడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు వెల్లడించిన అంశాల ఆధారంగా కేసీఆర్‌ను ప్రశ్నించడానికి సిట్ సన్నద్ధమైంది. రాధాకిషన్‌రావు, ప్రభాకర్‌రావులు రిటైరైనా వారిని అదే స్ధానాల్లో కొనసాగించడానికి కారణాలేమిటీ? ప్రతిపక్ష నేతలపై నిఘా కోసమే వారిని వాడుకున్నారా? అనే విషయాలపై కేసీఆర్ నుంచి స్పష్టత కోసం ప్రయత్నించనున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఫోన్ ట్యాపింగ్ ప్రారంభించామని ఆ ఎన్నికలు, తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలు, తర్వాత జరిగిన ఉప ఎన్నికల, 2023లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ ఆదేశాల మేరకు చాలామందిపై నిఘా పెట్టామని, ఫోన్ ట్యాపింగ్ చేశామని అంగీకరిస్తూ రాధాకిషన్‌రావు ఇప్పటికే సిట్‌కు వాంగ్మూలం ఇచ్చారు. కేసీఆర్ విచారణలో ఈ వాంగ్మూలం కీలకంగా మారనుంది.
ఫోన్ ట్యాపింగ్ అనేదీ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన వ్యక్తులు, సంస్థలపై చేయడానికి అనుమతి ఉంది. అయితే, అనధికారికంగా వేలమంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాపింగ్ చేయడానికి ముఖ్యమంత్రిగా మీరు అనుమతించారా? లేక మీకు తెలియకుండా ఇంకెవరైనా ఈ అనధికార ఫోన్ ట్యాపింగ్‌ను ప్రోత్సహించారా? అని కేసీఆర్‌ను అడిగి నిర్ధారించుకోనున్నారు. ముఖ్యమంత్రిగా మీ నుంచి ఆదేశాలు పోలీసు అధికారులకు ఏ విధంగా వెళ్లేవి? ముఖ్యమంత్రి హోదాలో మీరు చాలా ఏళ్లు ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ కూడా తీసుకోలేదు కదా? అని అడిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడటానికి కారణం ఫోన్ ట్యాపింగేనా? మీరు మీడియా సమావేశం పెట్టి వినిపించిన ఆడియో రికార్డింగ్‌లను మీకు చేరవేసింది ఎవరు? అని కేసీఆర్‌ను అడిగి స్పష్టత తీసుకోనున్నారు. రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు ఆయనపై అనుక్షణం నిఘా కొనసాగించారా? బీజేపీ అగ్రనేతలైన బండి సంజయ్, అరవింద్, ఈటెల రాజేందర్‌లపై నిఘా మీ ఆదేశాలతోనే జరిగిందా? అని అడగనున్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్‌ను విచారించడం ఆషామాషీ కాదని, ప్రతీ ప్రశ్నకు సాక్ష్యాధారాలు దగ్గరుంచుకున్నాకే ప్రశ్నలు సంధించాలని, ఆయన జవాబుల తర్వాత ఆధారాలు ఆయన ముందు పెట్టి కార్నర్ చేయాలని సిట్ భావిస్తోంది. విచారణకు సంబంధించి సిట్ చీఫ్ సజ్జనార్ ఇప్పటికే దర్యాప్తు బృందానికి దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది.
కేసీఆర్‌తో ఆర్‌ఎస్ ప్రవీణ్ భేటీ
మర్కుక్: ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్, మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఆదివారం నిరసనలకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా పోలీసులతో ఘర్షణలకు దిగవద్దని కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.