ధరణి సెట్‌కు చారుసిన్హా నేతృత్వం
ABN , Publish Date - Jul 25 , 2026 | 06:23 AM
రాష్ట్రంలో భూ రికార్డుల నిర్వహణ, క్రయ విక్రయాల్లో జరిగిన భారీ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందం(సెట్) ద్వారా లోతైన విచారణకు సిద్ధమైంది.
ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు
2020-23 మధ్య అవకతవకలపై లోతైన విచారణకు సన్నద్ధం
హైదరాబాద్, జూలై 24( ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూ రికార్డుల నిర్వహణ, క్రయ విక్రయాల్లో జరిగిన భారీ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందం(సెట్) ద్వారా లోతైన విచారణకు సిద్ధమైంది. ఏసీబీ అదనపు డీజీ చారు సిన్హా నేతృతంలోని విచారణ బృందం ధరణి అక్రమాలపై విచారణ చేయనుంది. ఇందుకు సంబంధించి కమిటీ సభ్యుల వివరాలతో ఒకటి రెండు రోజుల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. ఈ విచారణ బృందంలో రెవెన్యూ, ఐటీ నిపుణులు, సైబర్ క్రైమ్ విచారణలో నైపుణ్యం ఉన్న వ్యక్తులను ఎంపిక చేసినట్లు తెలిసింది. ధరణి అక్రమాలపై కేరళ ప్రభుత్వ సంస్థ(కేఎ్‌సఏఏసీ) నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో ఏకంగా పదివేల కంటే ఎక్కువ అనుమానాస్పద లావాదేవీలు వెలుగు చూశాయి. దీంతో ధరణి ప్రారంభం అయిన తేదీ 2020 అక్టోబరు 29 నుంచి జరిగిన అన్ని వివాదాస్పద భూ మార్పిడులపై విచారణ చేయనున్నారు. ముఖ్యంగా అసైన్డ్, ప్రభుత్వ భూములు పెద్దఎత్తున చేతులు మారినట్లు ప్రభుత్వం గుర్తించింది. 2020 నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే 2023 డిసెంబరు వరకు జరిగిన లావాదేవీలపై లోతైన విచారణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విక్రయించడానికి వీలులేని పేదల అసైన్డ్ భూములు, ప్రభుత్వ ఖాళీ స్థలాలను నిషేధిత జాబితా(22ఏ) నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల పరిధిలోనే ధరణి సమయంలో అత్యధికంగా ప్రభుత్వ భూములు చేతులు మారినట్లు అధికారులు గుర్తించారు. మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో సీలింగ్, అసైన్డ్ భూములను రియల్టర్లు దక్కించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. రికార్డులు తారుమారు చేసి 22ఏ జాబితాల్లో ఉన్న భూములను బడా రియల్ ఎస్టేట్ సంస్థలు సొంతం చేసుకున్నాయి. ఈ వ్యవహారంలో సర్వే నంబర్ల వారీగా భూముల లావాదేవీలపై సెట్ బృందం విచారణ చేయనుంది.
ఇటీవల మియాపూర్ సర్వే నంబరు 44లో సుమారు రూ.3 వేల కోట్ల విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల స్వాధీనంలో ఉంటే హైడ్రా సాయంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో ప్రభుత్వ సర్వే నంబరు 126లో 74 ఎకరాలు ఆక్రమణపై కోర్టు ఆదేశాలతో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. గండిపేటలో నకిలీ జీవోలతో రూ.1000 కోట్ల భూమిని బడా బాబులు హస్తగతం చేసుకోవడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూలావాదేవీల్లోఅక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రభుత్వం గుర్తించింది. భూ రికార్డుల నిర్వహణలో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రికార్డుల ట్యాంపరింగ్ భారీగా జరిగిందనే విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారుల డిజిటల్ కీలను దుర్వినియోగం చేసి రికార్డుల్లో పేర్లు మార్చడం, నకిలీ పట్టాలు, జీవోలు జారీ చేయడం, బోగస్ పట్టా ధ్రువీకరణ పత్రాలతో వందల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోయాయి. అక్రమంగా డీ నోటిఫై చేసి, ఆ భూములను డిజిటల్ రికార్డుల్లో చేర్చారు. ఈ నేపథ్యంలో సెట్ ఏర్పాటు చేశారు. ఈ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా భూ అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.