Share News

ఎస్‌ఐఆర్‌ గడువు పెంచండి

ABN , Publish Date - Jul 15 , 2026 | 06:12 AM

తెలంగాణ వ్యాప్తంగా ఓటరు సవరణ ప్రక్రియ(ఎ్‌సఐఆర్‌) నత్తనడకన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రక్రియ గడువును పెంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) సుదర్శన్‌రెడ్డిని..

ఎస్‌ఐఆర్‌ గడువు పెంచండి

  • రాష్ట్ర వ్యాప్తంగా నత్తనడకన ప్రక్రియ

  • హైదరాబాద్‌లో 21శాతమే పూర్తయింది

  • అర్హులైన వారు ఓట్లు కోల్పోవడం సరి కాదు

  • సీఈవోకు పొన్నం నేతృత్వంలో నేతల వినతి

హైదరాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వ్యాప్తంగా ఓటరు సవరణ ప్రక్రియ(ఎ్‌సఐఆర్‌) నత్తనడకన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రక్రియ గడువును పెంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) సుదర్శన్‌రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం కోరింది. ఎస్‌ఐఆర్‌లో భాగంగా చేపట్టిన ఎన్యుమరేషన్‌ ప్రక్రియ హైదరాబాద్‌లో కేవలం 21 శాతం మాత్రమే పూర్తయిందని వారు సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు ఇంకా పది రోజులు మాత్రమే గడువు ఉన్నందున.. మరిన్ని రోజులు పొడిగించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌ సహా అర్బన్‌ ప్రాంతాల్లో ఓటరు సవరణ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోందన్నారు. హైదరాబాద్‌ జిల్లాలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులు, ప్రభుత్వ టీచర్లు, జీహెచ్‌ఎంసీ సహకారం తీసుకోవాలని సీఈవోను కోరామన్నారు. బీఎల్‌వోలు ఎన్యుమరేషన్‌ ఫారాలను సరిగా పంపిణీ చేయట్లేదని, ఇళ్లకు రావట్లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో అర్హత కలిగిన ఏ ఒక్కరూ ఓటు కోల్పోకూడదన్నదే తమ సంకల్పమన్నారు. ఎన్యుమరేషన్‌కు పది రోజుల సమయం సరిపోదని, మరి కొన్ని రోజులపాటు గడువు పెంచాలని కోరామన్నారు. ఎస్‌ఐఆర్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు క్రియాశీలకంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సీఈవోను కలిసిన వారిలో మంత్రి పొన్నంతోపాటు ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌, ఎమ్మెల్యేలు శ్రీగణేష్‌, నవీన్‌ యాదవ్‌, టీపీసీసీ ఎలక్షన్‌ కమిషన్‌ సమన్వయ కమిటీ చైర్మన్‌ రాజేశ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 15 , 2026 | 06:13 AM