సర్.. పది రోజులే
ABN , Publish Date - Jul 15 , 2026 | 06:15 AM
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను ఆలస్యం చేయకుండా వెంటనే..
ఓటరు నమోదుపై సీఈవో సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను ఆలస్యం చేయకుండా వెంటనే సమర్పించాలని ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ ముగియడానికి పది రోజుల సమయం మాత్రమే ఉందని, సమయం తక్కువగా ఉన్నందున ఓటర్లు తక్షణమే స్పందించాలని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటివరకు 1,66,70,610 మంది మాత్రమే తమ వివారాలను నమోదు చేసుకుని ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. అంటే 49.28 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించారని, మిగిలిన వారు కూడా తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి పూరించిన ఫారాలను ఆలస్యం చేయకుండా బీఎల్‌వోలకు అందజేయాలని సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్యూమరేషన్ ఫారాల్లో వివరాలను తప్పుల్లేకుండా రాసి, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను అతికించాలి. పూర్తి చేసిన ఫారంపై తప్పనిసరిగా ఓటరు సంతకం, తేదీతో పాటు సంబంధిత బీఎల్‌వో సంతకం ఉండేలా చూసుకోవాలి. ఓటర్లకు అందజేసిన రెండు ఫారాల్లో ఒకటి బీఎల్‌వోకు ఇవ్వాలని, మరొకటి ఓటరు తమవద్దే భద్రపరుచుకోవాలని సీఈవో సూచించారు. గత ఓటరు జాబితా వివరాలు అందుబాటులో లేకపోయినా, ప్రస్తుత వివరాలతోనే ఫారంను నింపి అందజేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.