‘సర్’లో 60లక్షల ఓట్లకు కోత?
ABN , Publish Date - Aug 05 , 2026 | 05:27 AM
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ అనంతరం సుమారు 60 లక్షల మేర ఓటర్ల సంఖ్య తగ్గవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రాథమికంగా అంచనా వేస్తున్న అధికారులు
హైదరాబాద్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ అనంతరం సుమారు 60 లక్షల మేర ఓటర్ల సంఖ్య తగ్గవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇళ్లు మారిన ఓటర్ల వివరాల సేకరణలో ఇబ్బంది, చనిపోయినవారు, డూప్లికేట్ ఓట్లు, ఇతర రాష్ట్రాల వారి ఓట్లు వంటివి దీనికి కారణమని చెబుతున్నారు. ‘సర్’ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ఇంకా ఐదురోజులే (10వ తేదీ వరకు) గడువు ఉండటంతో.. అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. ఓటర్లను గుర్తించి, వివరాలు నమోదు చేయడంపై బూత్‌స్థాయి అధికారులు (బీఎల్‌వోలు), వివిధ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా నిర్ణీత చిరునామాల్లో లేనివారు ఎక్కడికి మారారు? వలస వెళ్లారా, స్థానికంగా మరోచోటికి మారారా అనేది ఆరా తీసి, వివరాలు సేకరిస్తున్నారు. మంగళవారం నాటికి 77.66 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మందకొడిగా సాగుతోందని.. భారీ సంఖ్యలో ఓటర్లు ఉండటం, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, చిరునామా నిర్ధారణలో ఇబ్బంది వంటివి దీనికి కారణమని అంటున్నారు. మొత్తంగా ‘సర్’ ప్రక్రియ పూర్తయ్యే సరికి రాష్ట్రంలో 60లక్షలకుపైగా ఓట్లు తగ్గే అవకాశం ఉందని సంబంధిత విభాగాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు 40లక్షల మంది ఓటర్ల జాబితాల్లోని చిరునామాల్లో అందుబాటులో లేరని అధికారులు గుర్తించారు. చనిపోయినవారు, రెండు-మూడు చోట్ల ఓటు నమోదై ఉన్నవారు (డూప్లికేట్ ఓట్లు).. తెలంగాణలో ఓటు నమోదు చేసుకున్న ఇతర రాష్ట్రాలవారు.. కలిపి మరో 20 లక్షల వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రక్రియ పూర్తయితేనే స్పష్టత వస్తుందని అంటున్నారు.