Share News

పల్లెల్లో 90 శాతం..నగరాల్లో 30 శాతం!

ABN , Publish Date - Jun 30 , 2026 | 05:35 AM

తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా ఓటరు ఎన్యూమరేషన్‌ పత్రాల పంపిణీ, వివరాల నమోదు విషయంలో.....

పల్లెల్లో 90 శాతం..నగరాల్లో 30 శాతం!

  • సర్‌ ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ తీరు!

  • వేగవంతానికి అధికారుల మల్లగుల్లాలు

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా ఓటరు ఎన్యూమరేషన్‌ పత్రాల పంపిణీ, వివరాల నమోదు విషయంలో పల్లెల్లో జోరు కనబడుతోంది. ఎన్నికల అధికారులు అందించిన సమాచారం ప్రకారం... సర్‌ ప్రారంభమైన నాటి నుంచి సోమవారం వరకు బీఎల్‌వోలు ఇంటింటికి తిరిగి రాష్ట్రవ్యాప్తంగా 1.73 కోట్ల ఎన్యూమరేషన్‌ ఫారాలను పంపిణీ చేసినట్లు తెలిసింది. పల్లెల్లో చాలాచోట్ల ఎన్యూమరేషన్‌ ఫారాలను 90శాతం వరకు పంపిణీ చేసినట్లు సంబంధిత విభాగాలు చెబతుండగా... హైదరాబాద్‌ సహా.. ముఖ్యమైన నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. నగరాల్లో కేవలం 30 శాతం మాత్రమే ఫారాల పంపిణీ జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా... చాలాచోట్ల బీఎల్‌వోలు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్‌ ఫారాలను పంపిణీ చేయలేదని, తగిన విధంగా స్పందించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసిన ఓటరు జాబితా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 3,38,26,448 మంది ఓటర్లకుగాను ఇప్పటి వరకు 1.73 కోట్ల ఎన్యూమరేషన్‌ ఫారాలను పంపిణీ చేశారు. కాగా నిర్ణీత సమయంలో ఓటర్ల వివరాలను నమోదు చేసి.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్‌లో బీఎల్‌వోలు సంబంధిత వివరాలను అప్‌లోడ్‌ చేయనున్నట్లు ఎన్నికల విభాగాలు తెలిపాయి.

అవగాహన కల్పించండి : సీఈవో

రాష్ట్రంలో కొనసాగుతున్న సర్‌ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, వారికోసం ఏర్పాటు చేసిన ఓటరు హెల్ప్‌లైన్‌ 1950, హెల్ప్‌ డెస్క్‌ నంబర్లపై విస్తృత ప్రచారం కల్పించాలని ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి.. జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీఈవోలు, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు ప్రతిరోజూ నిర్వహిస్తున్న ఓటరు అవగాహన కార్యక్రమాలను సమీక్షిస్తూ, సామాజిక మాధ్యమాల్లో క్రమం తప్పకుండా వివరాలను ప్రచురించాలన్నారు. అధికారుల క్షేత్ర పర్యటనలను సమగ్రంగా నమోదు చేయాలన్నారు. ఎన్యూమరేషన్‌ ఫారాలను సక్రమంగా నింపడంలో ఓటర్లకు సహాయపడే ప్రక్రియను వేగవంతం చేసి లక్ష్యాలను సమర్థంగా సాధించేలా బీఎల్‌వోలకు మరో విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సర్‌ ప్రక్రియ ప్రారంభమైన నాలుగు రోజుల్లో దాదాపు 1.73కోట్ల ఎన్యూమరేషన్‌ ఫారాలను పంపిణీ చేయడంపై బూత్‌స్థాయి అధికారులు, ఎన్నికల అధికారులను అభినందించారు. బీఎల్‌వోలు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. సర్‌లో రాజకీయ పార్టీలు, బూత్‌ స్థాయి ఏజెంట్లు(బీఎల్‌ఏ)పాల్గొని తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని సీఈవో సూచించారు.

Updated Date - Jun 30 , 2026 | 05:35 AM