Share News

ఓట్ల తొలగింపునకే ‘సర్‌’

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:47 AM

ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్‌) ప్రక్రియ ఓట్లు తొలగించే కార్యక్రమంగా మారిందని టీపీసీసీ..

ఓట్ల తొలగింపునకే ‘సర్‌’

  • సర్‌ అక్రమాలను కలిసికట్టుగా ఎదుర్కొందాం

  • రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌

  • ఓటు కోసం ఎన్ని ఉద్యమాలకైనా సిద్ధం: కూనంనేని

  • ఓటు లేకపోతే పౌరసత్వానికీ ముప్పే: ఎమ్మెల్సీ కోదండరాం

హైదరాబాద్‌, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్‌) ప్రక్రియ ఓట్లు తొలగించే కార్యక్రమంగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌ గౌడ్‌ విమర్శించారు. ఈ చర్యను కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌, లౌకికవాద శక్తులన్నీ కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూం భవన్‌లో శుక్రవారం సర్‌పై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. లౌకికవాద పార్టీలకు ఓటు వేస్తారనే అనుమానం ఉన్న ప్రతి ఓటును తొలగించే ప్రక్రియగా సర్‌ కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2002లో జరిగిన సర్‌కు, నేడు జరుగుతున్న సర్‌కు చాలా తేడా ఉందని అన్నారు. బూత్‌ లెవల్‌ ఏజెంట్లు ఓట్లను కాపాడుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ తరఫున ఇప్పటికే 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎల్‌ఏలకు శిక్షణ పూర్తి చేశామని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఓటును కాపాడుకునేందుకు ఎంతవరకైనా ఉద్యమాలకు సిద్ధమని కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. రాష్ట్రంలో 80 లక్షల మంది ఓటర్ల వివరాలు నిర్ధారణ కాలేదంటూ పత్రికల్లో వస్తున్న వార్తలు తీవ్రంగా కలవరపెడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో మూడుకోట్ల మంది ఓటర్లు ఉంటే, వారిలో 80 లక్షల మంది వివరాలు లభ్యం కాకపోవడం చిన్న విషయం కాదని అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారానే సర్‌ అక్రమాలకు అడ్డుకట్ట వేయగలమని కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి తెలిపారు. ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. ఓటు హక్కు లేకపోతే భవిష్యత్తులో పౌరసత్వాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తాము ఈ దేశ పౌరులమని ప్రజలే స్వయంగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు ప్రక్రియతోపాటు సమాజంలో ప్రశ్నించే గొంతులను అర్బన్‌ నక్సల్స్‌గా ముద్ర వేయడం వెనుక ఒక నిర్ధిష్టమైన రాజకీయ భావజాలం దాగి ఉందన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 04:47 AM