కోటి ఓట్లపై ఎస్‌ఐఆర్ కత్తి
ABN , Publish Date - Jun 16 , 2026 | 04:51 AM
ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో 1.08 కోట్ల ఓట్లను ఏదో ఒక కారణం చూపించి పక్కన పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.
ఇప్పుడు ఓట్లు పోతే తర్వాత చేసేదేం ఉండదు.. అప్రమత్తంగా ఉండండి
కాంగ్రెస్ పార్టీ జూమ్ మీటింగ్‌లో సీఎం రేవంత్
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో 1.08 కోట్ల ఓట్లను ఏదో ఒక కారణం చూపించి పక్కన పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అనుమానాస్పదం పేరుతో వాటిని తొలగించే అవకాశం ఉందని.. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొనాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్‌ను ఆషామాషీగా తీసుకోవద్దని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని మంత్రులకు, సర్‌కు సంబంధించి నియమితులైన లోక్‌సభ నియోజకవర్గ ఇంచార్జిలకు సీఎం స్పష్టం చేశారు. సర్‌లో భాగంగా 2028 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా ఈ ఏడాది అక్టోబరు నెలలోనే సిద్ధమవుతుందన్నారు. అనుమానాస్పదం పేరుతో పక్కన పెట్టిన ఓట్లను ఎన్నికల సంఘం (ఈసీ) తొలగిస్తే తర్వాత చేసేది ఏమీ ఉండదని హెచ్చరించారు. రాష్ట్రంలో సర్ ప్రక్రియ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సన్నద్ధతపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సోమవారం జూమ్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు, లోక్‌సభ నియోజకవర్గ ఇంచార్జులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రతీ గ్రామంలోని ప్రతీ ఒక్క బూత్ లెవల్ ఆఫీసర్‌ను (బీఎల్‌ఓ) పార్టీ స్థానిక ముఖ్య నాయకులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఓటర్లు ఏదైనా పని మీద ఇతర ప్రాంతాలకు వెళ్లినా, వలస వెళ్లినా.. వారి ఓట్లు తొలగింపునకు గురి కాకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ మేరకు ఈ నెల 20వ తేదీలోగా జిల్లాల ఇంచార్జి మంత్రులు సంబంధిత పార్లమెంటు, అసెంబ్లీ పార్టీ ఇంచార్జులతో సమీక్ష నిర్వహించాలని చెప్పారు. ఇంచార్జ్ మంత్రులు జిల్లా స్థాయిలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఎక్కడైనా సమస్య వస్తే సంబంధిత అసెంబ్లీ ఇంచార్జ్‌ను అప్రమత్తం చేయాలని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఎక్కడ సమస్య వచ్చినా సంబంధిత పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జే బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆయా నియోజకవర్గ ఇంచార్జ్‌లు బాధ్యత వహించాలన్నారు. సర్ ప్రక్రియను ప్రతి ఒక్కరూ సీరియ్‌సగా తీసుకోవాలని.. ఇది అత్యంత ప్రమాదకరమైన సందర్భమని, అప్రమత్తంగా ఉండాలని రేవంత్‌రెడ్డి సూచించారు. పార్లమెంట్ ఇంచార్జ్‌లు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో, అసెంబ్లీ ఇంచార్జిలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మానిటరింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గాంధీభవన్‌లో వార్ రూమ్ ఏర్పాటు చేసి బూత్ స్థాయిలో పర్యవేక్షణ జరపాలన్నారు. ఏ రోజుకు ఆ రోజు నివేదికలు తెప్పించుకోవాలని, ఎవరు నిర్లక్ష్యం వహించిన తీవ్ర నష్టం జరుగుతుందని.. కాబట్టి ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
ఈసీతో ఓట్ చోరీ.. ఇదే బీజేపీ పని: మీనాక్షి
మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ ద్వారా ఓట్ చోరీ చేయడమే బీజేపీ పనిగా పెట్టుకుందని ఆరోపించారు. సర్ ప్రక్రియలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో ఓట్ చోరీ ఎలా జరిగిందో చూశామని, ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. పాత ఓటర్ లిస్ట్‌ను ఇప్పటి ఓటర్ లిస్ట్‌తో పోల్చి చిన్న చిన్న పొరపాట్లు ఉన్న ఓట్లను కూడా తొలగిస్తున్నారని, అలాంటి ఓట్లను నిలబెట్టడానికి అవసరమైన అన్ని పత్రాలు సిద్ధం చేసుకుని ఉండాలన్నారు. ఇందుకోసం ప్రతి కార్యకర్త అవగాహన పెంచుకొని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌తో ముఖ్యంగా నిరక్షరాస్యులు, పేదలు నష్టపోయే ప్రమాదం ఉందని.. వారికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలవాలన్నారు. ఒక్క ఓటుకు కూడా నష్టం జరగొద్దని, ఇది కేవలం ఓటు మాత్రమే కాదు ప్రజల హక్కని, దాన్ని మనం కాపాడాలని మీనాక్షి పిలుపునిచ్చారు.
బూత్ స్థాయి ఏజెంట్లకు అవగాహన కల్పించాలి: భట్టి
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సర్ ప్రక్రియపై పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లకు సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. ఓటర్ల జాబితాలో చోటు చేసుకునే లోపాలపై, ముఖ్యంగా ‘అనామలీస్’ జాబితాలోని ఓటర్ల విషయంలో బూత్ ఏజెంట్లు అత్యంత జాగ్రత్తగా దృష్టి పెట్టి వాటిని సవరించే ప్రయత్నం చేయాలన్నారు. ప్రభుత్వ బూత్ లెవెల్ అధికారుల షెడ్యూల్‌కు అనుగుణంగా పోలింగ్ బూత్‌ల పరిధిలో వారితో కలిసి పర్యటించాలన్నారు. మహేశ్ కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. బెంగాల్‌లో ఓట్ల తొలగింపు కారణంగానే తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలైందన్నారు. ఓట్ మ్యాపింగ్‌లో కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని, ఓటర్ ఆన్ మ్యాపింగ్‌తోపాటు డౌట్ ఓట్లనూ నిశితంగా పరిశీలించాలన్నారు. ఏఐతో సోషల్ మీడియాను పరిశీలించి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని.. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతీ నేతా, కార్యకర్త ఓటర్ లిస్ట్ ఫైనల్ అయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.